టీకాలపై ఫోకస్.. టీచర్లకు గుడ్ న్యూస్..

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో తెలంగాణ సర్కారు టీకాల కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ విధిగా టీకా వేయించుకునేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ టీకా రెండు డోసులు పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖకు సూచించారు. తమ శాఖల్లో పనిచేసే ఉద్యోగులంతా టీకాలు వేయించుకున్నారా లేదా అనే విషయంపై ఆయా శాఖల ఉన్నతాధికారులు దృష్టిపెట్టాలన్నారు. వారం లోగా ఉద్యోగులందరికీ టీకా ప్రక్రియ పూర్తి కావాలన్నారు.

మాస్క్ లేకపోతే వెయ్యి బాదుడే..
మాస్క్ లేకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయల జరిమానా వసూలు చేయాలని, ఈ నిబంధన విషయంలో ఎవరికీ, ఎక్కడా వెసులుబాటు ఇవ్వకూడదని చెప్పారు కేసీఆర్. ప్రజా శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాల్సిందేనని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం వైద్యఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు కేసీఆర్. ఇటీవల తెలంగాణ హైకోర్టు మొట్టికాయల నేపథ్యంలో కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రతి జిల్లాలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ ల కేంద్రాలు విస్తృతంగా ఏర్పాటు చేయాలని, అవసరమైన కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు.

ప్రైవేటు టీచర్లకు అభయ హస్తం..
తెలంగాణలో స్కూల్స్, కాలేజీలు మూసివేయడంతో జీతాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ స్కూల్ టీచర్లకు కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటినుంచి తిరిగి స్కూల్స్ తెరిచే వరకు నెల నెలా 2వేల రూపాయలు ఆర్థిక సాయంతోపాటు రేషన్ షాపుల ద్వారా 25కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో దాదాపుగా తెలంగాణలోని 1.5 లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయులు లబ్ధి పొందుతారని తెలిపారు. గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు.. జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని, గుర్తింపు పత్రాలు, బ్యాంక్ ఖాతా వివరాలతో అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు. స్కూల్స్ మూసివేయడంతో ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ టీచర్లకు ఈ నిర్ణయంతో కాస్త వెసులుబాటు లభించినట్టయింది.