తెలంగాణలో మున్సిపల్​ ఎన్నికలకు నోటిఫికేషన్​..!

తెలంగాణలో మున్సిపల్​, కార్పొరేషన్​ ఎన్నికలకు నోటిఫికేషన్​ విడుదలైంది. ఇప్పటికే మున్సిపల్​, కార్పొరేషన్​ ఎన్నికలు ముగిశాయి. అయితే కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కోర్టు కేసులు, పదవీ కాలం ముగియకపోవడంతో ఎన్నికలు జరగలేదు. ఆ ఎన్నికలకు ప్రస్తుతం నోటిఫికేషన్​ విడుదలైంది. ఖమ్మం, వరంగల్​ కార్పొరేషన్లతో పాటు.. సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్‌, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్​ 30 న పోలింగ్​, మే 3న కౌంటింగ్​ జరుగనున్నది.

రేపటి (శుక్రవారం) నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 18 నామినేషన్లు వేసేందుకు తుది గడువు. నామినేషన్ల ఉపసంహరణకు 22వ తేదీ గడువుగా విదించారు. మొత్తం రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.

వరంగల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 66 డివిజన్లు ఉండగా, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి. ఇప్పటికే ఆయా రాజకీయపార్టీలు సాగర్​ ఉప ఎన్నికల్లో బిజీగా గడుపుతున్నాయి. ఆ ఎన్నికలు పూర్తికాకముందే మున్సిపల్​ ఎన్నికలకు సైతం నోటిఫికేషన్​ విడుదల కావడంతో రాజకీయ పార్టీల నేతలు బిజీగా మారనున్నారు.

ఇప్పటికే సాగర్​లో ఆయా పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ప్రచారానికి ఆఖరి రోజు. దీంతో అన్నిపార్టీల ముఖ్యనేతలు సాగర్​ నియోజకవర్గంలో మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మున్సిపోల్స్​కు నోటిఫికేషన్​ విడుదల కావడంతో.. అక్కడి ఎన్నికపై ఆయా పార్టీల నేతలు దృష్టి సారించనున్నారు.