తెలంగాణకు సీఎం అవుతా.. దీక్ష భగ్నం చేసినా వెనకడుగు వేయను -షర్మిల

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు వైఎస్ షర్మిల చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఖమ్మం సభలో మూడు రోజులపాటు దీక్ష చేస్తానంటూ షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ పోలీసులు మాత్రం ఒకరోజు మాత్రమే దీక్షకు అనుమతించారు. ఇందిరా పార్క్ వద్ద అనుచరులతో కలసి దీక్ష చేపట్టిన షర్మిల, అనంతరం తన నివాసం లోటస్ పాండ్ కు పాదయాత్రగా బయలుదేరారు. అక్కడ కూడా దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి, తమ వాహనాల్లో లోటస్ పాండ్ కి తరలించారు. అయితే అక్కడ కూడా ఆమె ఇంటిలోకి వెళ్లకుండా బయట ఏర్పాటు చేసిన వేదికపైనే బైఠాయించి నినాదాలు చేశారు. తనతోపాటు అరెస్ట్ చేసిన తన అనుచరుల్ని వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు మంచినీరు కూడా ముట్టుకోనని స్పష్టం చేశారు.

ఏదో ఒకరోజు.. తెలంగాణకు సీఎం అవుతా..
తాను 72 గంటల దీక్ష చేస్తానంటూ ఖమ్మం సభలో ప్రకటించానని, తన మాటంటే మాటేనని, తనను ఎక్కడకు తీసుకెళ్లినా, బందీగా చేసినా కూడా దీక్ష కొనసాగిస్తానని చెప్పారు షర్మిల. ఏదో ఒకరోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని అన్నారు. తనపై ఇంకోసారి చేయి పడితే ఊరుకునేది లేదని పోలీసుల్ని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కేసీఆర్ సమాధానం చెప్పాలి..
తెలంగాణలో నిరుద్యోగుల బలవన్మరణాలకు సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని ఇందిరా పార్క్ వద్ద దీక్షా స్థలిలో డిమాండ్ చేశారు షర్మిల. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ముందుండి పోరాటం చేసిన యువత కోసం వెంటనే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని అన్నారు. నిరుద్యోగులకు ఎవరు మద్దతిచ్చినా ఇవ్వకపోయినా, తాను ముందుండి పోరాడతానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపట్టే వరకు తెలంగాణ వ్యాప్తంగా దీక్షలు, నిరసనలు కొనసాగుతాయని షర్మిల వెల్లడించారు. ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంతో యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా.. సీఎం కేసీఆర్‌ పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.