తెలంగాణలో టెన్త్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు..

టెన్త్ క్లాస్ పరీక్షలు రద్దు చేస్తూ సీబీఎస్ఈ బోర్డ్ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే.. తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలు రద్దు చేసింది. అయితే పదో తరగతి ఉత్తీర్ణత విషయంలో కీలక ప్రకటన వెలువరించింది. ఎస్.ఎస్.సి. బోర్డ్ నిర్ణయించే ఆబ్జెక్టివ్ విధానం ద్వారా పదో తరగతి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. అంటే పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఫీజు కట్టిన విద్యార్థులంతా గట్టెక్కినట్టేనా, లేదా అనేదానిపై బోర్డు క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ఆబ్జెక్టివ్ విధానం ద్వారా వెలువడే ఫలితాలపై ఎవరికైనా అసంతృప్తి ఉంటే.. ఆ తర్వాత పరీక్షలు రాసేందుకు అవకాశమిస్తామని పేర్కొంది. ఒకరకంగా ఆల్ పాస్ అనకుండా.. ఇలా ఆబ్జెక్టివ్ విధానం ద్వారా అందర్నీ పాస్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం మే 17న తెలంగాణలో టెన్త్ పరీక్షలు జరగాల్సి ఉంది. 5.3లక్షలమంది పరీక్షలకోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు.. సెకండ్ ఇయర్ వాయిదా..
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షలపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థులందర్నీ పరీక్షలు నిర్వహించకుండానే సెకండ్ ఇయర్ కు ప్రమోట్‌ చేస్తామని స్పష్టం చేసింది. జూన్‌ రెండో వారంలో కొవిడ్ కేసులపై సమీక్ష నిర్వహించి రెండో సంవత్సరం పరీక్షలు జరపాలా వద్దా అనేదానిపై ప్రకటన విడుదల చేస్తామని తెలిపింది. బ్యాక్‌ లాగ్స్‌ ఉన్న రెండో సంవత్సరం విద్యార్థులకు కనీస పాస్‌ మార్కులు వేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఎంసెట్ ‌లో ఇంటర్‌ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది.

తెలంగాణలో పరీక్షల నిర్వహణపై ఎస్.ఎస్.సి., ఇంటర్‌ బోర్డు అధికారులతో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ సమావేశం నిర్వహించారు. పరీక్షల రద్దు, వాయిదా ప్రతిపాదనలకు సంబంధించిన విషయాలను సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపించారు. కేసీఆర్ ఆమోదం తెలిపిన తర్వాత విద్యాశాఖ నుంచి ప్రకటన విడుదలైంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంకా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలపై ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతానికి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.