ఎఫ్3 మూవీలో మరో హీరోయిన్

ఎఫ్3 సినిమాకు సంబంధించి, ఉగాది సందర్భంగా ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేయడంతో పాటు, అదే రోజు కొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ చేశారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పుడు ముచ్చటగా మూడో హీరోయిన్ వచ్చి చేరింది.

ఎఫ్3 సినిమాలో మెహ్రీన్, తమన్న హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం అంజలిని తీసుకున్నారు. ఆమె ఆల్రెడీ సెట్స్ లో జాయిన్ అయింది కూడా. ప్రస్తుతం అంజలి, వెంకటేష్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.

నిజానికి ఈ పాత్ర కోసం సోనాల్ చౌహాన్ ను అనుకున్నారు. ఆమెతో కొన్ని సన్నివేశాలు కూడా తీశారు. కానీ కరోనా వల్ల ముంబయి నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సాగించడానికి ఆమె విముఖత చూపించింది. పైగా యూనిట్ కూడా రిస్క్ గా ఫీల్ అయింది. దీంతో ఆమెను తప్పించి, ఆ స్థానంలో అంజలిని తీసుకున్నారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 27న రిలీజ్ చేయబోతున్నట్టు ఇంతకుముందు ప్రకటించారు. ఉగాది పోస్టర్ లో కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నారు. అయితే ఆచార్య, లవ్ స్టోరీ లాంటి సినిమాలు వాయిదా పడ్డంతో, ఎఫ్3 ఆ టైమ్ కు వస్తుందా రాదా అనేది చూడాలి.