మరింత ముదిరిన అపరిచితుడు వివాదం

అపరిచితుడు హిందీ రీమేక్ వ్యవహారం ఇప్పుడు మరింత ముదిరింది. అసలు ఈ సినిమా సెట్స్ పైకి
వస్తుందా రాదా అనే అనుమానాన్ని పక్కనపెడితే.. సినిమా హక్కులకు సంబంధించి సరికొత్త
అనుమానాల్ని, వాదనల్ని తెరపైకి తీసుకొచ్చింది. అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి వరుసగా జరిగిన
డెవలప్ మెంట్స్ ఏంటో చూద్దాం.

– రణ్వీర్ సింగ్ హీరోగా అపరిచితుడు సినిమా హిందీ రీమేక్ ను ప్రకటించాడు దర్శకుడు శంకర్. పెన్
స్టుడియోస్ బ్యానర్ పై జయంతీలాల్ గడా ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ మేరకు హీరో,
దర్శకుడు, నిర్మాత కలిసి ఫొటో దిగారు. దాన్ని షేర్ చేశారు.

– సరిగ్గా ఈ కార్యక్రమం ముగిసిన గంటల వ్యవథిలోనే ఆస్కార్ రవిచంద్రన్, శంకర్ కు ఓపెన్ లెటర్
రాశారు. అపరిచితుడు సినిమా నిర్మించింది ఇతడే. నిర్మాతగా సర్వ హక్కులు తన దగ్గర ఉన్నప్పుడు.. ఆ
సినిమాను హిందీలో మరో నిర్మాతతో ఎలా రీమేక్ చేస్తారనేది ఇతడి ప్రశ్న. ఈ మేరకు శంకర్ కు లీగల్
నోటీస్ కూడా పంపించాడు రవిచంద్రన్.

– ఆస్కార్ రవిచంద్రన్ వాదనల్ని తిప్పికొట్టాడు శంకర్. అపరిచితుడు సినిమాలో కథ-స్క్రీన్ ప్లే- డైరక్షన్
అనే టైటిల్ కార్డు తన పేరుమీదే పడింది కాబట్టి, ఈ సినిమాను రీమేక్ చేసే సర్వహక్కులు తనకు
ఉంటాయని చెబుతున్నాడు. కథ తనది కాబట్టి రీమేక్ చేసే రైట్స్ కూడా తనవే అంటున్నాడు.

శంకర్ వాదనతో ఇప్పుడీ వివాదం కొత్త మలుపు తిరిగింది. కథాహక్కులు రవిచంద్రన్ కు ప్రత్యేకంగా
రాయకపోతే.. రీమేక్ తీసుకునే రైట్ శంకర్ కు ఉంటుంది. కానీ ఆస్కార్ రవిచంద్రన్ మాత్రం అపరిచితుడు కథ-స్క్రీన్ ప్లే మొత్తం సుజాత అనే వ్యక్తిదని, అతడి నుంచి తాము సర్వహక్కులు రాయించుకున్నామని చెబుతున్నారు. ఈ సుజాత అనే వ్యక్తి గతంలో శంకర్ కు కుడిభుజంగా పనిచేశారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలతో పాటు ఎన్నో వ్యవహారాలు దగ్గరుండి చూసుకునేవారు. అయితే ఆయన చనిపోయారు.

సో.. అపరిచితుడు కథ-స్క్రీన్ ప్లే తనదే అంటున్నాడు శంకర్. అది సుజాతదని ఈ మేరకు అగ్రిమెంట్
ఉందని ఆస్కార్ రవిచంద్రన్ చెబుతున్నాడు. ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి. నిజంగా
ఈ విషయంలో శంకర్ గెలిస్తే.. ఇకపై దర్శకులు, కథారచయితలకు మరిన్ని హక్కులు ప్రాప్తించే అవకాశం
ఉంది.