వాయిదాల జాబితాలోకి మరో సినిమా

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న సినిమా ‘విరాట‌ప‌ర్వం`. ఈ సినిమాలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని స‌రికొత్త పాత్ర‌ల‌లో రానా, సాయి ప‌ల్ల‌వి కనిపించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌తో పాటు ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ ట్రెమండ‌స్ రెస్పాన్స్ సాధించింది.

90వ ద‌శ‌కంలో తెలంగాణలో జ‌రిగిన య‌ధార్ధ సంఘటనల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రంలో రానా కామ్రేడ్ `రవ‌న్న` పాత్ర పోషిస్తున్నారు. అతను తన కలంపేరు `అరణ్య`గా ప్ర‌సిద్ది. సాయి పల్లవి `వెన్నెల` అనే పాత్ర‌లో అతని ఆరాధకురాలిగా కనిపించ‌నుంది. ఒక అద్భుతమైన ప్రేమకథగా `విరాట పర్వం` తెర‌కెక్కుతోంది.

దేశవ్యాప్తంగా పెరుగుతున్న క‌రోనా వ్యాప్తి కార‌ణంగా ఏప్రిల్ 30న విడుద‌ల కావాల్సిన విరాట‌ప‌ర్వం సినిమాను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేకర్స్‌. కొత్త విడుద‌ల తేదిని త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “రివ‌ల్యూష‌న్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్” అనేది ట్యాగ్‌లైన్‌. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.