సోనూసూద్​కు కరోనా.. కోలుకోవాలంటూ అభిమానుల ప్రార్థనలు..!

కరోనా లాక్​డౌన్​ టైంలో చేసిన సేవా కార్యక్రమాలతో సోనూసూద్​ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. బాలీవుడ్​ నటుడైన సోనూ.. దక్షిణాదిన కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. విభిన్ననటుడిగా, విలన్​గా ఎన్నో పాత్రలు పోషించి ఇక్కడ ప్రేక్షకుల మన్ననలు పొందారు.

లాక్​డౌన్​ టైంలో దేశవ్యాప్తంగా వలసకూలీల జీవితం అగమ్యగోచరంగా మారిపోయింది. ఇటు ఉపాధి అవకాశాలు లేక.. అటు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రయాణ సౌకర్యం కూడా బంద్​ కావడంతో వలసకూలీలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఆ టైంలో సోనూసూద్​ వలస కూలీలను ఆదుకున్నారు. వాళ్లను సొంత ఊర్లకూ తీసుకెళ్లేందుకు కృషి చేశారు. చాలా మందికి ఉపాధి మార్గం చూపించారు. ఎందరో పేద వలసకూలీలకు తన వంతు ఆర్థిక సాయం చేశారు. దీంతో సోనూపై ప్రశంసల వర్షం కురిసింది.

కోట్ల రూపాయల రెమ్యునరేషన్​ తీసుకున్న హీరోలు కరోనా విపత్తును పట్టించుకోకపోయినా.. సోనూసూద్ ఎంతో గొప్ప మనసుతో నిరుపేదలను ఆదుకున్నారని ప్రశంసలు దక్కాయి. సోనూ రియల్​ హీరో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి.

అందుకు తగ్గట్టుగానే సోనూసూద్ ఎంతో మందికి ఆర్థిక సాయం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా సోనూసూద్​ కు కరోనా పాజిటివ్​ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సోనూసూద్​ నేరుగా సోషల్​మీడియాలో పంచుకున్నారు. ఇటీవల తనను కలిసిన వాళ్లంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

కాగా సోనూసూద్​కు కరోనా పాజిటివ్​ నిర్ధారణ కావడంతో ఆయన ఫ్యాన్స్​ అంతా పూజలు చేస్తున్నారు. తమ అభిమాన నటుడు తొందరగా కోలుకోవాలంటూ కోరుతున్నారు. కాగా సోనూసూద్ ప్రస్తుతం హోం ఐసోలేషన్​లో ఉంటూ చికిత్స పొందుతున్నట్టు సమాచారం.