టాలీవుడ్ లో కొందరికి ఆ రూల్స్ వర్తిస్తాయా?

నిర్మాతల మండలైనా, ఫిలిం ఛాంబర్ అయినా, ఇంకే అథారిటీ అయినా టాలీవుడ్ లో రూల్స్ విధిస్తే అది
కొందరికి మాత్రమే అనే రిమార్క్ ఉండనే ఉంది. పెద్ద హీరోలు నిబంధనల్ని తుంగలో తొక్కిమరీ తమ పని
తాము చేసుకుపోతారు. ఈసారి కూడా నిర్మాతల మండలి నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. మరి బడా
హీరోలు పాటిస్తారా?

టాలీవుడ్ లో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకొని షూటింగ్స్ విషయంలో
మార్గదర్శకాలు విడుదల చేసింది నిర్మాతల మండలి. అన్ని రకాల షూటింగ్స్ ఆపేయాలని, అత్యవసరం
అయితే తప్ప షూటింగ్స్ చేయకూడదని ఆదేశాలు జారీచేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్
చేయాల్సి వస్తే సిబ్బంది 50 మందిని మించకుండా చూసుకోవాలని పేర్కొంది.

ప్రస్తుతం పుష్ప షూటింగ్ నడుస్తోంది. యూసఫ్ గూడలో జరుగుతున్న ఈ షూటింగ్ కోసం దాదాపు 200
మంది పనిచేస్తున్నారు. మరోవైపు ఆచార్య షూటింగ్ కూడా నడుస్తోంది. రామ్ చరణ్ పై నడుస్తున్న ఈ
షెడ్యూల్ కోసం కూడా దాదాపు 200 మంది పనిచేస్తున్నారు. అటు ఫ్రెష్ గా మొదలైన రాధేశ్యామ్ లాస్ట్
షెడ్యూల్ కోసం దాదాపు వంద మంది పనిచేస్తున్నారు.

మరి ఈ బడా హీరోలంతా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఆదేశాల్ని పాటిస్తారా అనేది అందరి
అనుమానం. ఒకవేళ పాటించాలనుకుంటే మాత్రం 50 మందితో షూటింగ్ అసాధ్యం. కాబట్టి షూటింగ్స్
ఆపాల్సిందే.