‘ఆక్సిజన్’​ అడ్డుకుంటే ఉరితీస్తాం.. కోర్టు సీరియస్​..!

కరోనా విపత్తువేళ ఆక్సిజన్​ ఎంతో అత్యవసరమైంది. ప్రస్తుతం దేశంలోని చాలా ఆస్పత్రులను ఆక్సిజన్​ కొరత వేధిస్తున్నది. ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో కేవలం ఆక్సిజన్​ లేక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్​ను సరఫరా చేస్తున్నప్పటికీ సరిపోవడం లేదు. ప్రైవేట్​ కంపెనీలకు వెంటనే ఆక్సిజన్​ సరఫరాను నిలిపివేసి.. ఆస్పత్రులకు పంపించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

అయినప్పటికీ ఆక్సిజన్​ కొరత మాత్రం తీరడం లేదు. కరోనా సెకండ్​ వేవ్​లో వేగంగా విస్తరిస్తున్నది. గతంలో కంటే వెంట వెంటనే వ్యాధి వ్యాపిస్తున్నది. చాలా తొందరగా కరోనా బాధితులకు పరిస్థితి విషమిస్తోంది. దీంతో ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. మరోవైపు మృతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. మృతదేహాలను దహనం చేసేందుకు క్యూ కడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇదిలా ఉంటే ఆక్సిజన్​ కొరతపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. కొందరు అధికారులు ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ ఆస్పత్రిలో రోగులకు సరిపడా ఆక్సిజన్​ లేదని ఢిల్లీలోని మహారాజా అగ్రసేన్​ ఆస్పత్రి పిటిషన్​ దాఖలు చేసింది. ఈ పిటిషన్​ను జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ రేఖా పల్లి తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.

‘కొందరు అధికారులు ఆక్సిజన్​ సరఫరాను అడ్డుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ అదే నిజమైతే అటువంటి అధికారులకు ఉరిశిక్ష విధిస్తాం’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ఆక్సిజన్ సరఫరాను ఎవరైనా అడ్డుకుంటే వెంటనే కోర్టు దృష్టికి తీసుకురావాలనీ.. అతడిని తాము ‘‘ఉరి తీస్తా’’మని కోర్టు పేర్కొంది.

‘‘ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు..’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ కొరత ఏర్పడ్డ విషయం తెలిసిందే. దీంతో కోర్టు స్పందించింది.