సాయం అడగక తప్పడం లేదు..

మొన్నటి వరకూ దేశం కరోనాని విజయవంతంగా ఎదుర్కొంది. ప్రపంచానికి ఔషదాలయంగా మారి.. ప్రపంచమంతటికీ వ్యాక్సీన్స్ ను పంపీణీ చేసింది అని చెప్తూ వచ్చింది భారత ప్రభుత్వం.. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రపంచమంతా.. భారత్ గురించి బాధ పడుతుంది. భారత్ కూడా ప్రపంచదేశాలను చేయిచాపి సాయం అడగక తప్పడం లేదు.

కరోనా సెకండ్ వేవ్ లో కేసులు లక్షల్లో పెరిగాయి. మరణాలు వేలసంఖ్యలో ఉన్నాయి. దేశంలో ఆక్సీజన్ లేదు. హాస్పిటల్స్ లో బెడ్స్ ఖాళీగాలేవు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ 16 ఏళ్ల తర్వాత పాలసీ విధానంలో భారీ మార్పులు చేసింది. విదేశాల నుంచి బహుమతులు, విరాళాలు, సహాయాన్ని స్వీకరించడానికి అంగీకరించింది.

ఎప్పటి నుంచో.. భారత్ విదేశీ సహాయాన్ని నిరాకరిస్తూ వస్తోంది.ఎలాంటి పరిస్థితిని అయినా సొంతంగా ఎదుర్కోగలమన్న నినాదంతో ముందుకెళ్తుంది. కానీ.. ఇప్పుడు తప్పట్లేదు. ఎప్పుడూ లేని విధంగా.. చైనా నుంచి ఆక్సిజన్ సంబంధిత పరికరాలు, కొన్ని ఔషధాలను కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించింది.
దీంతోపాటు ఇప్పటివరక చాలా దేశాలు భారత్ కు సాయం చేయడానికి ముందుకొచ్చాయి. భూటాన్ ఆక్సిజన్ సరఫరా చేయగా, అమెరికా వచ్చే నెలలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను అందించబోతోంది. వీటితో పాటు యుకే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఐర్లాండ్, బెల్జియం, పోర్చుగల్, స్వీడన్, ఆస్ట్రేలియా, సింగపూర్, సౌదీ అరేబియా, హాంకాంగ్, థాయ్ లాండ్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, నార్వే , ఇటలీ, యుఎఇ దేశాలు కూడా సాయం చేయడానికి రెడీగా ఉన్నాయి.

అయితే భారత్ నేరుగా ఏ దేశాన్ని సాయం కోరదు. అవి సాయం చేస్తే నిరాకరించకుండా అంగీకరిస్తాయి. ప్రభుత్వాలు లేదా ప్రైవేట్ సంస్థలు బహుమతిగా విరాళం ఇవ్వాలనుకుంటే, కృతజ్ఞతతో అంగీకరిస్తుంది. అయితే అన్ని దేశాలతో పాటు పాకిస్తాన్ నుంచి కూడా సహాయాన్ని అంగీకరించాలా వద్దా అనే దానిపై భారత ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మొత్తానికి దేశం ఇప్పుడు తీవ్రమైన కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోటోంది.