దర్శక దిగ్గజం కన్నుమూత

కోలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. కమెడియన్ వివేక్ మరణాన్ని మర్చిపోకముందే మరో మరణ
వార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కేవీ ఆనంద్ కన్నుమూశారు. ఈ రోజు
తెల్లవారు జామున ఆయన గుండెపోటుతో మరణించారు. ఉదయాన్నే ఈ వార్త విని కోలీవుడ్ షాక్ కి
గురైంది.

సినిమాటోగ్రాఫర్ గా దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు ఆనంద్. పీసీ శ్రీరామ్
దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఆనంద్ ‘తెన్మవిన్ కొమ్భాత్’ అనే మలయాళ సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా
మారారు. మొదటి సినిమాకే సినిమాటోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు.

తమిళ్ లో ‘కాదల్ దేశం’ సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా పరిచయమయ్యారు. ఆ సినిమా తెలుగులో ప్రేమదేశంగా విడుదలై ఘన విజయం అందుకుంది. ఆ తర్వాత శంకర్ డైరెక్ట్ చేసిన ‘బాయ్స్’ ,’ఒకే ఒక్కడు’, ‘శివాజీ’ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు ఆనంద్. ఆ తర్వాత కెమెరామెన్ గా పలు సినిమాలకు పనిచేశారు.

శివాజీ తర్వాత సినిమాటోగ్రాఫర్ గా పనిచేయని కేవీ ఆనంద్, దర్శకుడిగా మారారు. రంగం, అనేకుడు, వీడొక్కడే, బ్రదర్స్, బందోబస్త్ లాంటి సినిమాలు తీశారు. దర్శకుడిగా ఆయన తీసిన చివరి చిత్రం సూర్య నటించిన బందోబస్త్.