ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి.. ఎవరి సత్తా ఎంతంటే..?

దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు సంచలనాలకు మాత్రం వేదిక కాలేదు. ఎన్నికల ముందు ఎలాంటి వాతావరణం ఉందో.. ఎన్నికలు పూర్తయ్యాక కూడా ఫలితాలు అలానే ఉంటాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పడం విశేషం. పోటా పోటీగా జరిగిన పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో అధికార తృణమూల్ కూటమికే మరోసారి పీఠం దక్కుతుందని సర్వేలు చెబుతున్నాయి. తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే అధికారానికి ఎగబాకడం, అసోంలో అధికార ఎన్టీఏ, కేరళలో అధికార ఎల్డీఎఫ్ పరువు నిలబెట్టుకోవడం సహా.. పుదుచ్చేరిలో బీజేపీ హవా మొదలవుతుందనే విషయంపై ఎగ్జిట్ పోల్స్ క్లారిటీ ఇచ్చాయి.

బెంగాల్ లో దీదీ హ్యాట్రిక్..!
ఎనిమిది దశల్లో జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దాదాపు రణరంగాన్నే తలపించాయి. నామినేషన్ వేసిన రోజునుంచీ మమతా బెనర్జీ చక్రాల కుర్చీకే పరిమితం అయి ప్రచారం చేయడం సహా.. అధికార, ప్రతిపక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులతో బెంగాల్ రణరంగంగా మారింది. ఓవైపు కొవిడ్ ఉధృతి కొనసాగుతున్నా కూడా ఎనిమిది దశల్లో అక్కడ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ మాత్రం దీదీకే పట్టం కట్టేలా కనిపిస్తున్నాయి. అయితే తృణమూల్, ఎన్డీఏ మధ్య స్వల్ప తేడానే ఉంటుందని సర్వేలు తేల్చడం విశేషం.

294 స్థానాల బెంగాల్ అసెంబ్లీ బరిలో.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి..
సీఓటర్: టీఎంసీ 158, బీజేపీ 115, కాంగ్రెస్, ఇతరులు – 19
బెంగాల్ పీమార్క్ : బీజేపీ 120, టీఎంసీ 158, లెఫ్ట్‌, ఇతరులు 14
బెంగాల్ ఈటీజీ : బీజేపీ 110, టీఎంసీ 169, లెఫ్ట్‌, ఇతరులు 12
రిపబ్లిక్‌-సీఎన్‌ఎక్స్: టీఎంసీ 128-138, బీజేపీ138-148, కాంగ్రెస్: 11-21
సీఎన్‌ఎన్: టీఎంసీ 128-132, బీజేపీ: 138-148, ఇతరులు – 20

తమిళనాడులో స్టాలిన్ శకం..
234 స్థానాల తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మొదటి నుంచీ విపక్ష డీఎంకేకే మొగ్గు ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విషయాన్ని ధృవీకరించాయి. అధికార అన్నాడీఎంకేతో కలసి ఎన్డీఏ ఎన్ని ఎత్తులు వేసినా వారి పాచిక పారేలా కనిపించడంలేదు.
రిపబ్లిక్‌ సీఎన్‌ఎక్స్‌: డీఎంకే 160-170, అన్నాడీఎంకే 58-68
పీమార్క్‌: డీఎంకే కూటమి 165-190, అన్నాడీఎంకే 40-65
ఏబీపీ సీఓటర్‌: డీఎంకే 160-172, అన్నాడీఎంకే 40-60

అసోంలో మరోసారి అధికార ఎన్డీఏ పట్టు నిలుపుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
126 అసెంబ్లీ స్థానాల అసెంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి.
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్: బీజేపీ: 75-85, కాంగ్రెస్‌: 40-50
రిపబ్లిక్‌ ఎగ్జిట్‌పోల్: బీజేపీ 74-84, కాంగ్రెస్: 40-50

140 స్థానాల కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ కూటమికే మరోసారి ప్రజలు అవకాశం ఇస్తారని అర్థమవుతోంది.

రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్: లెఫ్ట్‌ఫ్రంట్ 70-80, కాంగ్రెస్ 40-50

30 స్థానాల పుదుచ్చేరి అసెంబ్లీ పోరులో.. బీజేపీ చరిత్ర సృష్టించే అవకాశం కనిపిస్తోంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే: బీజేపీ కూటమి 18, కాంగ్రెస్ కూటమి 12

మొత్తమ్మీద.. అసోంలో పట్టు నిలుపుకోవడంతోపాటు.. పుదుచ్చేరిలో కొత్తగా అధికారం హస్తగతం చేసుకోవడం, బెంగాల్ లో వామపక్షాల ప్రాభవాన్ని ఒడిసిపట్టుకోవడంతో బీజేపీ సరిపెట్టుకుంటున్నట్టు ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెబుతున్నాయి.