దుబ్బాక నుంచి సాగర్ వరకు.. బీజేపీ ప్రయాణం..

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు అసలు సిసలు ప్రత్యామ్నాయం బీజేపీయేనంటూ ఆ పార్టీ నేతలు కొన్నాళ్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక విజయం, ఆ తర్వాత వచ్చిన జీహెచ్ఎంసీ ఫలితాలను చూపించి తెలంగాణ గడ్డపై కాషాయజెండా రెపరెపలాడే రోజు ఎంతో దూరంలో లేదని చెబుతూ వచ్చారు నేతలు. కానీ.. పరిస్థితిలో క్రమక్రమంగా మార్పులొచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలోనే బీజేపీ అసలు సత్తా ఏంటో తెలిసొచ్చింది. తాజాగా.. సాగర్ ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ తో.. తెలంగాణలో బీజేపీ బలమేంటో బయటపడే రోజులొచ్చాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దుబ్బాక దూకుడు కొనసాగితే.. సాగర్ లో కూడా బీజేపీ విజయం సునాయాసం అయి ఉండేది. అయితే కనీసం సాగర్ ఉప ఎన్నికలో బీజేపీకి గుర్తుంపు పొందే స్థాయిలో కూడా ఓట్లు రావని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెబుతున్నాయి.

ఆరా సంస్థ ప్రకారం
నాగార్జున సాగర్ లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థికి 50.48శాతం ఓట్లు, కాంగ్రెస్ కి 39.93 శాతం, బీజేపీకి 6.31శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. పొలిటికల్ లేబొరేటరీ సంస్థ అంచనాల ప్రకారం టీఆర్ఎస్ కి 48నుంచి 50శాతం ఓట్లు, కాంగ్రెస్ కి 38నుంచి 42శాతం ఓట్లు, బీజేపీకి 6నుంచి కేవలం 8శాతం ఓట్లు మాత్రమే వస్తాయని తెలుస్తోంది. అంటే.. కనీసం 10శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేని స్థితికి బీజేపీ పడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.

2018లో దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి 13.75 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2020నాటికి రఘునందన్ రావుకి వచ్చిన ఓట్ల శాతం 38.47. అదే దూకుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ కొనసాగించారు బీజేపీ నేతలు. అధికార టీఆర్ఎస్ ని ముప్పతిప్పలు పెట్టారు. అక్కడితో కథ మలుపు తిరిగిందని అనుకున్నారంతా. కానీ.. ఆ తర్వాతే టీఆర్ఎస్ మేలుకుంది. తెలంగాణలో బీజేపీ జైత్రయాత్రకు ఎమ్మెల్సీ ఎన్నికలతో అడ్డుకట్ట వేసింది. బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని సైతం టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. అదే ఊపులో సాగర్ లో కూడా టీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు వేసింది. అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో మీనమేషాలు లెక్కించడం కూడా బీజేపీకి ఇబ్బందిగా మారింది. అటు కాంగ్రెస్ తరపున జానారెడ్డి బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో.. బీజేపీ అనివార్యంగా మూడో స్థానానికి, అది కూడా కేవలం 7శాతం ఓట్లకు పడిపోయేలా కనిపిస్తోంది. తెలంగాణలో దూకుడు పెంచుతామనుకుంటున్న బీజేపీకి సాగర్ ఉప ఎన్నికల ఫలితాలు అశనిపాతంగా మారే అవకాశం ఉంది.