తిరుపతిలో ప్రతిపక్షాల ఆశలు గల్లంతేనా..?

అధికార పక్షం అహంకారాన్ని దించుతామని ఒకరు, అసలైన ప్రతిపక్షం తామే అనిపించుకుంటామని మరొకరు.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై గంపెడాశలు పెట్టుకున్నారు. పరిషత్ ఎన్నికల్ని సైతం బహిష్కరించి తిరుపతిలో సుడిగాలి పర్యటన చేశారు చంద్రబాబు. అధికార ప్రతిపక్షాలకు దీటుగా బీజేపీ నేతలు సైతం తిరుపతిలో కలియదిరిగారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని సైతం తిరుపతి ప్రచారానికి తీసుకొచ్చారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన కవాతుతో సీన్ మారిపోయిందని అన్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం అధికార వైసీపీదే సునాయాస విజయం అని తేల్చేశాయి. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో అధికార వైసీపీకి 65.85 శాతం ఓట్లు వస్తాయని ఆరా సంస్థ అంచనా వేసింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కేవలం 23.10 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటుందని, బీజేపీ-జనసేన కూటమికి 7.34 శాతం, ఇతరులకు 3.71 శాతం ఓట్లు వస్తాయని లెక్క తేల్చింది.

తిరుపతిలో సింపతీ ఓటుకోసం చూడకుండా.. కొత్త అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని బరిలో దింపింది వైసీపీ. అదే సమయంలో టీడీపీ పాత అభ్యర్థి పనబాక లక్ష్మిని తెరపైకి తెచ్చి హడావిడి చేసింది. కర్నాటక మాజీ సీఎస్ ని రంగంలోకి దింపి బీజేపీ వ్యూహాత్మక అడుగు వేశామని చెప్పుకొచ్చింది. అయితే ఈ వ్యూహాలన్నీ తిరుపతిలో పనిచేయలేదని ఎగ్జిట్ పోల్స్ రుజువు చేసేలా ఉన్నాయి.

2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ స్థానం పరిధిలో 13,16,473 ఓట్లు నమోదు కాగా, అప్పటి వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాదరావుకి 55.03 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పనబాకకు 37.65శాతం ఓట్లు వచ్చాయి. ఇక ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి 1.22శాతం, జనసేన సపోర్ట్ తో బరిలో దిగిన బీఎస్పీ అభ్యర్థికి 1.60శాతం, విభజన శాప విమోచనం దొరకని కాంగ్రెస్ కి 1.83శాతం ఓట్లు రాగా.. వీరిని మించి నోటాకు 1.96శాతం ఓట్లు రావడం విశేషం. రెండేళ్ల లోపు జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడా పరిస్థితుల్లో మార్పు రాలేదని అర్థమవుతోంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలలాగే.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో కూడా ఫలితాలు అధికార పక్షానికే పూర్తి అనుకూలంగా రాబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెబుతున్నాయి. ఈ దశలో అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని చెబుతున్న టీడీపీ, బీజేపీ, జనసేనకు ఈ ఎన్నికల ఫలితాలు నిరాశనే మిగిల్చేలా ఉన్నాయి.