ఏపీలో కోవిడ్ చికిత్స.. గరిష్ట ధర రూ.16వేలు..

కోవిడ్ చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స రోజువారీ ఫీజులపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్యాకేజీ పద్ధతిలో కాకుండా.. రోజువారీ వైద్యం అందించే విధానంపై ఆధారపడి ఫీజులు వసూలు చేయాలని చెప్పింది. సీటీ స్కాన్ కి కూడా గరిష్ట ఫీజు ఖరారు చేసింది. వీటిని అతిక్రమిస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించింది.

గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో ఫీజుల వివరాలు..
నేషనల్‌ అక్రిడేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్స్‌ (ఎన్ఏబీహెచ్) గుర్తింపు పొందిన ఆస్పత్రులలో ఫీజులను ఇలా ఖరారు చేసింది ప్రభుత్వం.
నాన్ క్రిటికల్ కేర్ (రోజుకి) – రూ. 4,000
ఆక్సిజన్ తో కూడిన చికిత్స (రోజుకి) – రూ. 6,500
క్రిటికల్ కేర్ ఐసీయూ (రోజుకి) – రూ. 12,000
ఐసీయూ విత్ వెంటిలేటర్ (రోజుకి) -రూ. 16,000

ఎన్ఏబీహెచ్ గుర్తింపులేని ఆస్పత్రుల్లో ఫీజులు స్వల్పంగా తక్కువగా ఉంటాయి..
నాన్ అక్రిడేటెడ్ ఆస్పత్రుల్లో ఫీజుల వివరాలు
నాన్ క్రిటికల్ కేర్ (రోజుకి) – రూ. 3,600
ఆక్సిజన్ తో కూడిన చికిత్స (రోజుకి) – రూ. 5,850
క్రిటికల్ కేర్ ఐసీయూ (రోజుకి) – రూ. 10,800
ఐసీయూ విత్ వెంటిలేటర్ (రోజుకి) -రూ. 14,400

ఓపీ ఫీజు, నర్సింగ్ ఛార్జీలు, రూమ్ రెంట్, రోగికి భోజనం, కోవిడ్ పరీక్ష ఛార్జి, పీపీఈ కిట్లు, మందులు.. అన్నిటికీ కలిపి ఒకరోజుకి గరిష్టంగా ఫీజు వసూలు చేయాలని, అదనంగా ఎలాంటి ఫీజు ఉండరాదని ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. కోవిడ్ ఆస్పత్రులుగా నోటిఫై అయిన వెంటనే కోవిడ్ రోగులను చేర్చుకోవాలని, నిరాకరించవద్దని చెప్పింది. కోవిడ్ బాధితుల నుంచి ఎలాంటి అడ్వాన్సు తీసుకొవద్దని, రోజువారీ వైద్యంకోసం అయిన ఖర్చుని మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది.

సీటీ స్కాన్ కి గరిష్టంగా రూ.3వేలు..
ఏపీలో ఎక్కడైనా సీటీ స్కాన్ కి ఒకటే రేటు ఉండేలా నిర్థారించింది రాష్ట్ర ప్రభుత్వం. స్కానింగ్ సెంటర్లలో కానీ, ఆస్పత్రుల్లో కానీ, గరిష్టంగా సీటీ స్కాన్ కు రూ.3వేలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పీపీఈ కిట్లు, గ్లౌజ్ లు.. ఇలా ఇతర వడ్డనలు అందులో ఉండరాదని పేర్కొంది. ఇక రెమెడిసివిర్ ఇంజెక్షన్ వైల్ కు రూ.2,500 మాత్రమే ఛార్జి చేయాలని పేర్కొంది. కోవిడ్ చికిత్సల ధరల వివరాలను ప్రతి ప్రైవేటు ఆస్పత్రులోనూ ప్రదర్శించాలని ఆదేశించింది.