నాది భయపడే జాతి కాదు.. ఏ విచారణకైనా సిద్ధం – ఈటల

భూకబ్జా ఆరోపణలు, మీడియాలో వచ్చిన కథనాలు, సీఎం కేసీఆర్ విచారణ ఆదేశాలపై తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కాస్త ఘాటుగానే స్పందించారు. తాను ఆత్మగౌరవం ఉన్న వ్యక్తినని, ఆస్తులు, పదవులు, ఇతర చిల్లర విషయాలకు లొంగిపోనని స్పష్టం చేశారు. ఆత్మగౌరవం కన్నా పదవి ముఖ్యం కాదని తేల్చి చెప్పారు. అచ్చంపేట, హకీంపేటలో తాను ఎవరి భూమినీ కబ్జా చేయలేదని, అసైన్డ్‌ భూములు కొనకూడదనే విషయం తనకు తెలుసని, రైతులే స్వచ్ఛందంగా వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తే.. తాను ప్రభుత్వం వద్ద తీసుకోవాలనుకున్నానని వివరించారు. తొండలు గుడ్లు పెట్టని భూములకు, అసలు సాగు చేయని భూములకు సైతం తాము ఎకరాకి రూ.6లక్షలు చెల్లించామని చెప్పారు.

పథకం ప్రకారం విషం చిమ్ముతారా..?
తాను ఏ తప్పూ చేయలేదని, పథకం ప్రకారమే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, కక్షగట్టి ప్రణాళికాబద్ధంగా కుట్రలను.. కట్టుకథలను మొదలుపెట్టారని, తెలంగాణ ప్రజల హృదయాల్లో తాను సంపాదించుకున్న గౌరవంలో విషం చల్లే ప్రయత్నం చేస్తున్నారని మీడియా సమావేశంలో మండిపడ్డారు మంత్రి ఈటల. తనకు అందరి చరిత్రలు తెలుసని అన్నారు. స్కూటర్‌ పై వచ్చి వందల కోట్లు సంపాదించింది ఎవరో అందరికీ తెలుసని, ఒక్క సిట్టింగ్‌ లోనే వందలు, వేల కోట్లు సంపాదించినవారు కూడా చాలామంది ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో అన్యాయంగా తన పొలం లాగేసుకుంటే.. ఒంటరిగా పోరాటం చేశానంటూ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వందలాదిమంది జైళ్లకు వెళ్తే కాపాడానని, తన నియోజకవర్గంలో ప్రతి గడపా తన వల్ల లబ్ధిపొందిందేనని చెప్పారు.

ఏ విచారణకైనా సిద్ధం..
ఏసీబీతోనే కాదు.. సిట్టింగ్‌ జడ్జితో లేదా ఎన్ని సంస్థలుంటే అన్నింటితోనూ విచారణ జరిపించాలని కోరారు ఈటల. కబ్జా ఆరోపణలే కాదు.. మొత్తం తన చరిత్ర మీద కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. “నా చరిత్ర చెరిపేస్తే చెరగనిది. ఈటల అంటే నిప్పు. ఎక్కడా, ఎవరి దగ్గరా పది రూపాయలు కూడా తీసుకున్న పాపాన పోలేదు. నాతో పనులు చేయించుకున్న వారెవరి దగ్గరైనా విచారించుకోవచ్చు. నాపై ఈ ఆరోపణలు వస్తుంటే వాళ్లు ఏడుస్తున్నారు.. తమ గుండెలు గాయపడుతున్నాయని నాకు ఫోన్లు చేస్తున్నారు. నేను నయీం లాంటి వాడు బెదిరిస్తేనే బెదరలేదు. అందరి చరిత్రలు నాకు తెలుసు.” అని అన్నారు.

కులం పేరుతో అవమానిస్తారా..?
“నేను ముదిరాజ్‌ బిడ్డను. భయపడే జాతి కాదు. చావనైనా చస్తాం కాని ఆత్మాభిమానాన్ని వదులుకోం. నేను బీసీని అయినా నా భార్య రెడ్డి కులస్తురాలు. నా పిల్లలకు రెడ్డి అని ఆమె పేరు పెట్టుకుంటే దానిపైనా విమర్శలు చేస్తున్నారు. బీసీ దొర అని నన్ను అవమానిస్తున్నారు. దొరలకు గులాం చేసే చరిత్ర నాకు లేదు. దొరల సంస్కృతికి నేను వ్యతిరేకం.” అని అన్నారు ఈటల. 2007లో కేసీఆర్ చెప్పడం వల్లే తాను బంజారాహిల్స్ లో రూ.5కోట్లతో స్థలం తీసుకున్నానని, ఇంకా అది వివాదాల్లోనే ఉందని, ఇల్లు కూడా కట్టుకోలేదని గుర్తు చేశారు. 1986లోనే తాము పౌల్ట్రీ బిజినెస్ లోకి అడుగు పెట్టామని, అప్పటికే తమకు 50 కోళ్ల ఫారాలున్నాయని చెప్పారు ఈటల. 2004 కంటే ముందే తనకు 124ఎకరాల భూమి ఉందని, దాన్ని క్రమక్రమంగా అమ్ముకుంటూ వచ్చానని చెప్పారు.

బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే దానిపై తనని వివరణ అడగాలని, అలా కాకుండా మీడియాలో తామే పరిశోధించినట్టు కథనాలు రావడం నీతిబాహ్యమైన చర్యగా అభివర్ణించారు ఈటల. తన క్యారెక్టర్ ను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు.