పాత సినిమాకు కొత్త కలరింగ్

దాదాపు రెండేళ్ల కిందటి సంగతి. విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు హీరో రానా. ఆ టైమ్ లో బ్యానర్ నుంచి అడ్వాన్స్ కూడా అందుకున్నాడు. కానీ అప్పట్లో కథలో తేడాలొచ్చి ఆ సినిమాను పక్కనపెట్టేశాడు. ఇక ఆ సినిమా రాదనుకున్న టైమ్ లో మళ్లీ ప్రకటన వచ్చింది.

అవును.. విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై రానా హీరోగా ఆచంట గోపీనాధ్ నిర్మాతగా మరోసారి సినిమాను ప్రకటించారు. ఈసారి ముందుజాగ్రత్త చర్యగా దర్శకుడు ఎవరనే విషయాన్ని చెప్పలేదు. త్వరలోనే ఆ విషయం చెబుతామని దాటేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభం కానుంది.

నందమూరి బాలకృష్ణ హీరోగా ‘టాప్ హీరో’, ‘దేవుడు’, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ‘జంబలకిడి పంబ’, రాజేంద్రప్రసాద్ హీరోగా ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్’ సినిమాలను ఆచంట గోపినాథ్ నిర్మించారు. నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్ ‘ఇమైక్క నొడిగల్’ను తెలుగులో ‘అంజలి సిబిఐ’గా విడుదల చేశారు. కొంత విరామం తర్వాత రానా దగ్గుబాటి హీరోగా భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారు.