గుజరాత్ గ్రామాల మధ్య కంచె.. ఒడిశాలో కఠిన ఆంక్షలు..

లాక్ డౌన్ వ్యవహారంపై కేంద్రం ఆదేశాలిచ్చే వరకు రాష్ట్రాలు వేచి చూసేలా కనిపించడంలేదు. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ తరహా ఆంక్షలు అన్ని రాష్ట్రాల్లోనూ అమలులో ఉన్నాయి. అయినా కూడా సెకండ్ వేవ్ కనికరించకపోవడంతో చాలా రాష్ట్రాలు అంతకు మించి అన్నట్టుగా కఠిన నిబంధనలు రూపొందిస్తున్నాయి. తాజాగా గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కీలక ఆదేశాలిచ్చారు. గుజరాత్ లోని దాదాపు 14వేల గ్రామాల ప్రజలు ఎవరికి వారే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించారు. 15రోజులపాటు ఏ ఒక్క గ్రామం కూడా ఇంకో గ్రామంతో సంబంధం పెట్టుకోకూడదు. ఒక గ్రామం నుంచి, ఇంకో గ్రామానికి రాకపోకలు ఉండకూడదు. ఎవరికి వారే, ఎక్కడివారక్కడే ఉండిపోవాలి. దీనికి సంబంధించి గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలని పంచాయతీ పెద్దలకు ఆదేశాలిచ్చారు సీఎం విజయ్ రూపానీ. గ్రామాల్లో కరోనా వ్యాప్తిని కట్టడి చేయగలిగితే రాష్ట్రంలో వైరస్ దానంతట అదే నియంత్రణలోకి వస్తుందని ఆయన చెప్పారు. 15రోజులపాటు ఇతర గ్రామాలకు వెళ్లొద్దని, పక్క ఊరివారెవర్నీ తమ గ్రామాలలోకి రానివ్వొద్దని ఆయన స్థానికులకు సూచించారు.

ఆంక్షల వలయంలో ఒడిశా..
మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాల్లో లాక్ డౌన్ తరహా నిబంధనలతో కొద్దోగొప్పో ఫలితం కనిపించడంతో.. ఇతర రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వరకు ధైర్యం చేశాయి. తాజాగా.. ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే-5 నుంచి 19వ తేదీ వరకు, 14 రోజులపాటు లాక్ డౌన్ అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లాక్ డౌన్ కాలంలో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోతుంది. ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12గంటలలోపు మాత్రమే నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి. అది కూడా సామాజిక దూరం పాటిస్తూ వినియోగదారులు మాస్క్ లు ధరించి రోడ్లపైకి వచ్చి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 12 తర్వాత మెడికల్ షాపులు మినహా ఇంకేవీ ఒడిశాలో తెరచి ఉంచడానికి వీలు లేదు.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల షాపులు తెరచి ఉంచుతున్నారు. స్థానికంగా జిల్లా అధికారులు నియమ నిబంధనలు రూపొందిస్తున్నారు. అయితే ఒడిశా మాత్రం రాష్ట్రవ్యాప్తంగా 14రోజుల లాక్ డౌన్ ప్రకటించి కరోనా కట్టడిలో కీలక నిర్ణయం తీసుకుంది.