భారత్ లో లాక్ డౌన్ పెట్టాల్సిందే.. నిపుణుల డిమాండ్

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న వేళ, రోజు రోజుకీ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. రోజువారీ లెక్కలు 4 లక్షల ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇక్కడినుంచి కేసుల సంఖ్య తగ్గుతుందా, లేదా నిలకడగా ఉంటుందా అనే ఆశ కూడా లేదు. పరిస్థితి చూస్తుంటే.. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలో కరోనా రోజువారీ కేసుల్లో భారత్ రికార్డులు బద్దలు కొడుతోంది. లాక్ డౌన్ ఒక్కటే దీనికి విరుగుడు అనే మాట మరోసారి తెరపైకి వస్తోంది. లాక్ డౌన్ అత్యవసరం అనే వాదన వినిపిస్తోంది.

రాత్రి కర్ఫ్యూ, పగటి వేళ లాక్ డౌన్ తరహా నిబంధనలు అమలు చేస్తున్న రాష్ట్రాల్లో కొంతవరకు మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ కోసం కొంతమంది నిపుణులు కేంద్రానికి సలహా ఇస్తున్నారు. ఎయిమ్స్ చీఫ్.. డాక్టర్ రణదీప్ గులేరియా కూడా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. ఢిల్లీ ఆస్పత్రిలో 12మంది రోగులు ఆక్సిజన్ కొరత కారణంగా చనిపోయారన్న వార్తలపై స్పందించిన ఆయన.. లాక్ డౌన్ అమలు చేయాలని చెబుతున్నారు. వ్యాక్సినేషన్ తో కరోనాని అడ్డుకుంటామన్న ఆశలు ఉన్నా కూడా.. వ్యాప్తిని అడ్డుకోవాలంటే మాత్రం లాక్ డౌన్ తప్పనిసరి అంటున్నారు. ఇప్పటికే ఆలస్యం అయిందని, వెంటనే దేశవ్యాప్త లాక్ డౌన్ విధించి కేసుల సంఖ్యను అదుపులో ఉంచాలని ఆయన కోరారు.

అటు అమెరికాకు చెందిన ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కూడా భారత్ లో కొద్దివారాలపాటు లాక్ డౌన్ అమలు చేయాలని సూచించారు. ఏడాది క్రితం చైనాలో కరోనా పుట్ట పగిలినప్పుడు వెంటనే వారు దేశాన్ని షట్ డౌన్ చేశారని, అందుకే వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిందనే విషయాన్ని గుర్తు చేసారు. తొలి విడతలో భారత్ కూడా లాక్ డౌన్ తో మెరుగైన ఫలితాలు సాధించిందని, రెండో విడతలో చేతులెత్తేయడం సరికాదని చెప్పారు ఫౌచీ. 6 నెలలపాటు లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని, తాత్కాలికంగా మాత్రం దేశం షట్ డౌన్ కావాల్సిందేనని అన్నారు.

4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కాబోతున్న నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని గతంలోనే ఊహాగానాలు వినిపించాయి. అయితే వాటన్నిటినీ కేంద్ర పెద్దలు కొట్టిపారేశారు. కానీ రోజువారీ కేసుల సంఖ్య 4లక్షలకు చేరడం, ఆక్సిజన్ కొరత, ఆస్పత్రిలో బెడ్స్ కొరత వేధిస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రం కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాల్ని కొట్టిపారేయలేం. నిపుణుల సలహాలు పరిగణలోకి తీసుకుంటే భారత్ మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ లోకి వెళ్లాల్సిందే.