రాజీనామా చేస్తా.. పదవులకోసం పెదవులు మూసుకోను.. – ఈటల

“కారు గుర్తుపై గెలిచాను కాబట్టి రాజీనామా చేయాలని మీరు అడగొచ్చు, త్వరలోనే చేస్తా, ఈటల రాజేందర్‌ పదవుల కోసం పెదవులు మూయడు. హుజూరాబాద్‌ కార్యకర్తలతో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తా. నా మొత్తం ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి” అని అన్నారు ఈటల రాజేందర్.

మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన ఈటల.. నేరుగా కేసీఆర్ ని టార్గెట్ చేశారు. కేసీఆర్ తనకు ఇచ్చిన అవకాశాలను ప్రస్తావిస్తూనే.. తనని టార్గెట్ చేశారంటూ విమర్శించారు. యావత్‌ తెలంగాణ అసహ్యించుకునేలా తనపై దుష్ప్రచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేల ఎకరాల భూములు ఆక్రమించానని, కుంభకోణాలు చేసినట్లు అవాస్తవాలు ప్రచారం చేశారని అన్నారు. 19 ఏళ్లపాటు కేసీఆర్‌ తో కలిసి పని చేశానని ఈటల గుర్తు చేసుకున్నారు. ఫ్లోర్‌ లీడర్‌ గా కూడా తనకు పార్టీ అవకాశం ఇచ్చిందని, అలాంటి పార్టీకి మచ్చ తెచ్చే పని తానెప్పుడూ చేయలేదని అన్నారాయన.

“మంత్రిగా అవకాశం ఇచ్చిన కేసీఆర్ కి మచ్చ తెచ్చే ప్రయత్నం నేనెప్పుడూ చేయలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో అసెంబ్లీలో పోరాడాం. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఏనాడూ అధర్మం వైపు వెళ్లలేదు, అణచివేతకు భయపడలేదు. తెలంగాణ ప్రజలను, ధర్మాన్ని నమ్ముకున్నారు కానీ డబ్బులను నమ్ముకోలేదు. అలాంటి కేసీఆర్‌ నాలాంటి సాధారణ వ్యక్తిపై తన శక్తినంతా ఉపయోగిస్తున్నారు. నాపై అన్ని శాఖలను ప్రయోగిస్తున్నారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని పిలిపించుకొని చర్చోపచర్చలు జరిపారు. చర్చల తర్వాత అసత్య ప్రచారానికి ఒడిగట్టడం కేసీఆర్‌ స్థాయికి తగదు. రాజ్యం మీ చేతిలో ఉండొచ్చు, అధికారులు మీరు చెప్పింది చేయొచ్చు. భూములు కొలుస్తామని నోటీసులు ఇవ్వకుండా, వందల మంది పోలీసులను పెట్టి సర్వే చేయడం మీకు న్యాయసమ్మతమేనా? రాజ్యం చాలా శక్తిమంతమైంది. సీఎంగా మీకు ఎదురు చెప్పే పరిస్థితి ఎవరికీ లేదు. నాపై కేసులు పెట్టవచ్చు.. కానీ చట్టం ఉంది” అని అన్నారు ఈటల రాజేందర్.

మీ శిష్యుడినే కదా, మీ రూట్లోనే వెళ్తా..
అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే ప్రజలు హర్షించరని అన్నారు ఈటల రాజేందర్. కార్మికుల కోసం షెడ్లు వేస్తే 66 ఎకరాలు కబ్జా చేసినట్లు నివేదిక ఇవ్వడం సరికాదన్నారు. ప్రేమతో లొంగదీసుకుంటే లొంగేవాడిని కానీ, భయపెడితే లొంగేవాడిని కాదని తేల్చి చెప్పారు. పార్టీ పెడతానని.. పార్టీ మారతానని తానెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. కలెక్టర్‌ నివేదిక తమకు అందలేదని, కనీసం తమ వివరణ కూడా అడగలేదని అన్నారు. ఎంత పెద్ద కేసులు పెట్టినా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. ప్రజల్ని నమ్ముకోవడం కేసీఆర్ శిష్యరికంలో నేర్చుకున్నానని అదే విధానాన్ని నమ్ముకుంటానని చెప్పారు. ఒకరికొకరు ఎందుకు దూరమయ్యామో కేసీఆర్ అంతరాత్మకు తెలుసని చెప్పారు ఈటల.