ఈటల కుటుంబం న్యాయపోరాటం..

తనపై వచ్చిన ఆరోపణల్ని న్యాయస్థానాలలో ఎదుర్కొంటానని ప్రకటించిన ఈటల రాజేందర్.. తన కుటుంబ సభ్యుల ద్వారా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయించారు. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట పరిధిలోని తమ భూముల్లో చట్టవిరుద్ధంగా సర్వే చేశారంటూ ఈటల సతీమణి, కుమారుడు, జమున హేచరీస్‌ తరపున హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమకు సంబంధించిన భూముల్లో సర్వే చేసి బోర్డులు పెట్టారని జమున హేచరీస్‌ తరపున కోర్టుకి వివరించారు. తమ భూముల్లోకి రాకుండా, జమున హేచరీస్ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని, బలవంతపు చర్యలు తీసుకోకుండా డీజీపీ, విజిలెన్స్, మెదక్‌ కలెక్టర్‌ ను ఆదేశించాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు.

తెలంగాణలో ఆత్మగౌరవ ఉద్యమం..
మరోవైపు తన భవిష్యత్ కార్యాచరణపై ఈటల రాజేందర్ పూర్తి స్థాయిలో దృష్టిసారించారు. తాజాగా తెలంగాణ ఎన్ఆర్ఐ లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తనకు మద్దతు తెలిపిన ఎన్ఆర్ఐలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఆత్మ గౌరవ ఉద్యమం ప్రారంభమైందని చెప్పారు. తప్పుడు ఆరోపణలు తనను బయటకు పంపారని, ప్రలోభాలకు లొంగలేదనే తనపై నిందలు వేస్తున్నారని ఆయన ఎన్ఆర్ఐల వీడియో సమావేశంలో తెలిపారు. మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తాను డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాను నిర్దోషినని, కావాలనే తనని టార్గెట్ చేశారని చెప్పారు ఈటల. తనకు ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంతో పాటు కాన్వాయ్‌ ని కూడా ఈటల, ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. ఎమ్మెల్యేగా ఇచ్చే గన్‌ మెన్లను మినహా మిగతా సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కి పంపేశారు.