కరోనా బారినుంచి కోలుకున్న కేసీఆర్..

తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు తెలిపారు. తాజాగా ఆయనకు చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో కోవిడ్ నెగెటివ్ గా తేలిందని చెప్పారు. ఏప్రిల్ 19న కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ కావడంతో అప్పటినుంచి ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్ లో ఉన్నారు కేసీఆర్. కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ఆ తర్వాత రెండు రోజులకు ఏప్రిల్ 21వ తేదీన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి కేసీఆర్ ని తరలించారు. అక్కడ సీటీ స్కాన్ సహా ఇతర పరీక్షలు చేసి వెంటనే తిరిగి ఫామ్ హౌస్ కి తీసుకొచ్చారు. అప్పటికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు ప్రకటించారు.

గత వారం కేసీఆర్ కు యాంటిజెన్ పరీక్ష నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. దీంతో కేసీఆర్ కి కరోనా తగ్గిపోయిందనే ప్రచారం జరిగింది. అయితే ఆర్టీపీసీఆర్ పరీక్షలో కచ్చితమైన ఫలితం రాలేదని ప్రకటించారు వైద్యులు. దీంతో ఐదు రోజుల తర్వాత ఇప్పుడు కేసీఆర్ కు మరోసారి యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఈ రెండు పరీక్షల్లో ఆయనకు కోవిడ్ నెగెటివ్ గా తేలింది. రక్త పరీక్షల నివేదికలు కూడా సాధారణంగా ఉన్నాయని ప్రకటించారు వైద్యులు. సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్లు తెలిపారు.