ఏపీలో రెండో డోసుకే ఫస్ట్ ప్రయారిటీ..

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానాన్ని అమలు చేస్తోంది. మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారికి కొన్ని రాష్ట్రాలు టీకా పంపిణీ మొదలు పెట్టగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాలు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ 45 ఏళ్లు పైబడినవారికేనని స్పష్టం చేశాయి. వయసురీత్యానే కాకుండా.. డోసుల విషయంలో కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో రెండో డోసు వేయడం పూర్తయిన తర్వాతే కొత్తగా ఫస్ట్ డోస్ వేసే ప్రక్రియ మొదలు పెడతామని ప్రకటించారు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.

ఫ్రంట్ లైన్ వారియర్స్ కి తొలి విడత టీకా పంపిణీ మొదలు పెట్టిన సందర్భంలో కొవాక్సిన్ డోసులకంటే, కొవిషీల్డ్ డోసులు ఎక్కువగా రాష్ట్రాలకు అందాయి. తొలి డోసు ఏ టీకా తీసుకుంటే, మలి డోసు కూడా అదే కంపెనీ టీకా తీసుకోవాల్సి ఉండటంతో.. చాలా చోట్ల వ్యత్యాసం వచ్చింది. తొలి దశ కొవాక్సిన్ తీసుకున్న వారు, రెండో డోసుకోసం ఎక్కువరోజులు వేచి చూడాల్సి వచ్చింది. సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో టీకాకు డిమాండ్ పెరిగిన తర్వాత కొవిషీల్డ్ తీసుకున్నవారు కూడా రెండో డోసు కోసం వేచి చూడాల్సిన సందర్భం వచ్చింది. రెండు డోసుల మధ్య 4 వారాల గ్యాప్ ఉండాలని నిపుణులు చెబుతున్నా.. టీకాల లభ్యత ప్రకారం చాలామంది ఆరేడు వారాల తర్వాత రెండో డోసు వేయించుకున్న ఉదాహరణలు కూడా ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఈ అంతరానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. ముందుగా 45 సంవత్సరాలు పైబడినవారికి రెండు డోసుల టీకా పంపిణీ చేయాలని నిర్ణయించింది. రెండో డోసుకోసం ఎవరూ ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం లేకుండా వారి కోటా పూర్తి చేసి, ఆ తర్వాత ఓ ప్రణాళిక ప్రకారం తొలి డోసు వేయడం మొదలు పెడతామని చెబుతున్నారు అధికారులు.

కేంద్రం నుంచి ఈనెల 15లోగా రాష్ట్రానికి 9 లక్షల టీకా డోసులు వస్తాయని చెబుతున్న అనిల్ కుమార్ సింఘాల్.. రెండో డోసు అవసరమైన వారికి పంపిణీ త్వరితగతిన పూర్తిచేస్తామని తెలిపారు. ఆ తరవాత ఆర్టీసీ, బ్యాంకులు, జర్నలిస్ట్ లు, ఇతర శాఖల్లో పనిచేస్తూ 45 ఏళ్లు పైబడిన వారికి తొలి డోసు టీకా పంపిణీలో ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అప్పటికీ టీకా డోసులు మిగిలితే.. ఇతరులకు తొలి విడత టీకా మొదలు పెడతామని అన్నారు. దీనికి మరిన్ని రోజుల సమయం పడుతుందని ఆయన అంచనా వేశారు.

మే నెల కోటాకు సంబంధించి 13.35 లక్షల(కొవిషీల్డ్‌ 9,91,700, కొవాగ్జిన్‌ 3,43,930) కరోనా టీకా డోసులను కేంద్రం ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. ఇందులో 5 లక్షల డోసులు మంగళవారం రాష్ట్రానికి చేరాయి. ఇవి మొత్తం కొవిషీల్డ్ టీకాలే కావడం గమనార్హం. పోలీసు బందోబస్తు మధ్య గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించిన అధికారులు.. అక్కడినుంచి జిల్లాలకు సరఫరా చేశారు. ఏపీలో 45 ఏళ్ల పైబడిన వారికి పూర్తి స్థాయిలో మొదటి, రెండో విడత టీకా పంపిణీకి ఈ డోసులను వినియోగిస్తామని అధికారులు పేర్కొన్నారు. రెండో డోసు వేయడం పూర్తయ్యాకే, తొలి విడతకోసం టీకాలు వినియోగిస్తారు.