ఈటల కొత్త పార్టీ?

తెలంగాణ మాజీ మంత్రి, ఉద్యమకారుడు ఈటల రాజేందర్​ బహిష్కరణ వ్యవహారం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఆయన మీద ఇటీవల అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని చానళ్లు, పత్రికల్లో ఈటల కబ్జాకోరు అంటూ వార్తలు వెలువడ్డాయి. ఆ వెంటనే ఆయన మీద విచారణ, టీఆర్ ఎస్ నుంచి బహిష్కరణ జరిగిపోయాయి. అయితే ఈ వ్యవహారం వల్ల ఈటల మీద ప్రజల్లో విపరీతమైన సానుభూతి ఏర్పడింది. తెలంగాణ వ్యాప్తంగా పలు పట్టణాల్లో, గ్రామాల్లో ఆయన అనుచరులు ర్యాలీలు నిర్వహించారు. గతంలోనూ చాలా మంది నేతలు టీఆర్​ఎస్​ నుంచి బలవంతంగా గెంటివేయబడ్డారు.

ఆలె నరేంద్ర, విజయశాంతి, రఘునందన్​రావు లాంటి నేతలు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. వెళ్లిపోయే పరిస్థితిని కల్పించారు. కానీ అప్పటి ఆ నేతలకు ప్రజల నుంచి పెద్దగా మద్దతు దక్కలేదు. కానీ ప్రస్తుతం ఈటల రాజేందర్​కు మాత్రం అనూహ్యంగా ప్రజా మద్దతు దక్కుతున్నది. ఓ ఉద్యమకారుడిని కావాలనే కుట్రపూరితంగా పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారని తెలంగాణ సమాజం నమ్ముతున్నది.

ఇటువంటి పరిస్థితుల్లో ఈటల రాజేందర్​ రాజకీయభవిష్యత్​ ఏమిటి? అన్న విషయం పై చర్చ మొదలైంది. ఈటల రాజేందర్​ కొత్తగా రాజకీయపార్టీ పెట్టబోతున్నారా? లేక కాంగ్రెస్​, బీజేపీ లాంటి పార్టీల్లో చేరబోతున్నారా? అన్న విషయం ఆసక్తికరంగా మారింది.

ఈటల రాజేందర్ కొత్తగా పార్టీ పెట్టబోతున్నట్టు ప్రస్తుతం ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన వర్గీయులు, అనుచరులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దిశగానే చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు కాంగ్రెస్​, బీజేపీలు కూడా ఈటల రాజేందర్​ను తమ వైపుకు తిప్పుకొనేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నాయి.

అధికార పార్టీ నేత మీద ఆరోపణలు వచ్చినప్పుడు విపక్షాలు సదరు నేత మీద దుమ్మెత్తి పోయడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ మంత్రి మీద ఆరోపణలు వస్తే.. విపక్షాలు ఆయనకు మద్దతు ఇవ్వడం గమనార్హం. అందుకు కారణం ఈటల రాజేందర్​ సౌమ్యుడు కావడం. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా పనిచేయడమే కారణం. 2001 నుంచి సాగిన మలిదశ ఉద్యమంలో ప్రతి దశలోనూ ఈటల రాజేందర్​ ఉన్నారు.

ఈటల లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఊహించడం కష్టం. కేసీఆర్​కు వెన్నుదన్నుగా ఉంటూనే ఈటల రాజేందర్​ బలమైన నేతగా ఎదిగారు.తన నియోజవర్గ ప్రజలకు నిత్యం టచ్​లో ఉంటూ వాళ్ల బాగోగులు పట్టించుకున్నారు. అందుకే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పార్టీలతకతీతంగా ఆయనకు మద్దతు దక్కుతున్నది.

తెలంగాణ రాష్ట్ర సమితిలోని పలువురు ఉద్యమకారులు సైతం ఈటల రాజేందర్​కు అనుకూలంగా మాట్లాడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఈటల రాజేందర్​ కొత్త పార్టీ పెట్టబోతున్నారా? లేక కాంగ్రెస్​, బీజేపీలో చేరనున్నారా? అన్నది వేచి చూడాలి.

ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టించి జైలుకు పంపించినా సానుభూతి వస్తుంది తప్ప.. ఈటల అవినీతి పరుడు అని ఎవరూ అనరు. అందుకు కారణం ప్రస్తుత రాజకీయాలు కలుషితమయ్యాయి. ఇక్కడ నిజాయితీ పరులను వేళ్ల మీద లెక్కపెట్టే పరిస్థితి కూడా లేదు.