కష్టకాలంలో చిల్లర రాజకీయాలా..?

కేంద్రం సకాలంలో, సరైన పరిమాణంలో వ్యాక్సిన్ సరఫరా చేస్తే రోజుకు 6 లక్షల మందికి టీకా ఇవ్వగల సామర్థ్యం ఏపీకి ఉందని అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే వ్యాక్సినేషన్ ఆలస్యం కావడానికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం, చిల్లర రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వ్యాక్సినేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు అర్థరహితం అని అన్నారాయన. కేంద్రం చేతుల్లో ఉండే వ్యాక్సిన్లతోపాటు, ఆక్సిజన్ కొరతకు రాష్ట్ర ప్రభుత్వంపై నిందలేయడం సరికాదని, ఈ విషయం చంద్రబాబుకి తెలియకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.

బాబు హయాంలో కరోనా వచ్చి ఉంటే..?
చంద్రబాబు హయాంలో వైద్యాన్ని గాలికొదిలేశారని, అప్పుడు కోవిడ్ వచ్చి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని అన్నారు సజ్జల. వైసీపీ హయాంలో ‘నాడు – నేడు’ కార్యక్రమం ద్వారా ఆసుపత్రులను తీర్చిదిద్దాము కాబట్టే ప్రజలను రక్షించగలుగుతున్నామని చెప్పారు. కోవిడ్ ను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చడంతోపాటు, 90శాతం మంది ప్రజల్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు వచ్చి పేదలకు భరోసా కల్పించామని అన్నారు.

సెకండ్ వేవ్ లో మరిన్ని జాగ్రత్తలు..
కరోనా ఫస్ట్ వేవ్ కంటే, సెకండ్ వేవ్ లో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని వివరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. గతేడాది కోవిడ్ సేవలకోసం 200 ఆస్పత్రులు మాత్రమే అందుబాటులో ఉంటే.. ఈ ఏడాది వాటి సంఖ్యను 630కి పెంచామని చెప్పారు. వారం రోజుల వ్యవధిలోనే పడకల సామర్థ్యాన్ని 27 వేల నుంచి 45 వేలకు పెంచి ఆక్సిజన్‌ లభ్యత చేకూర్చామని చెప్పారు. రాష్ట్రంలో ఏప్రిల్‌ 24 నాటికి కేవలం 19వేల ఆక్సిజన్‌ బెడ్స్‌ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 29వేలకు పెంచామని అన్నారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లను 40 నుంచి 80కి పెంచామని చెప్పారు. కొత్తగా వైద్యుల నియామకాలు చేపట్టామని గుర్తు చేశారు. గతేడాది లాక్‌ డౌన్‌ సమయంలో అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకుందని, ఈ ఏడాది కూడా ప్రత్యక్ష నగదు బదిలీతో ప్రజలకు ఆర్థిక భరోసా అందిస్తున్నామని చెప్పారు. ఇన్ని చేస్తున్నా ప్రజల హాహాకారాలు అంటూ విపక్షం ఆరోపణలు చేయడం దుర్మార్గమని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

కరోనాపై యుద్ధంలో వైసీపీ కార్యకర్తల భాగస్వామ్యం..
కరోనాపై చేస్తున్న యుద్ధంలో వైసీపీ కార్యకర్తలంతా భాగస్వాములు కావాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 9143541234, 9143641234 వాట్సాప్‌ నంబర్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని ఆయన జిల్లా పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.