ఏపీలో కొత్త వేరియంట్.. దాని పేరు నారా-420

ఏపీలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ పై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్440-కె రకం ఏపీలో ప్రబలిందంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని అధికార పక్షం తిప్పికొట్టింది. కేంద్ర బయో టెక్నాలజీ శాఖ కార్యదర్శి సైతం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఏపీలో కొత్త వేరియంట్ ఏదీ లేదని ఆమె చెప్పారు. ఇదే విషయాన్ని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రస్తావిస్తూ.. చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా.. ఎంపీ విజయసాయిరెడ్డి, కొత్త వేరియంట్ అంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు.

ఏపీలో కొత్త తరహా వైరస్ ఉందని, అయితే దాని పేరు ఎన్440-కె కాదని, నారా-420 అని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. “సీసీఎంబీ రిపోర్టు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు గోబెల్స్ ప్రచారం ఆపడం లేదు. N440K వైరస్ వేరియెంట్ ప్రబలిందంటూ NARA-420 వైరస్ ప్రచారం చేస్తోంది. హైదరాబాద్ పారిపోయినా నారా 420 వైరస్ ఆనవాళ్లు మాత్రం రాష్ట్రంలో అక్కడక్కడా ఉన్నాయి. ప్రజల్ని భయపెట్టడమే పనిగా పెట్టుకుందీ ఈ జూమ్ భూతం.” అంటూ ట్విట్టర్ లో మండిపడ్డారు విజయసాయిరెడ్డి.

“14 ఏళ్లు సీఎంగా వెలగబెట్టానని చెప్పుకునే చంద్రబాబు ఏనాడూ వైద్య రంగంలో మౌలిక వసతుల విస్తరణను పట్టించుకోలేదు. అప్పుడే ముందు చూపు కనబర్చి ఉంటే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం తేలికయ్యేది. వైద్యం ప్రభుత్వ బాధ్యతే కాదని చెప్పిన వ్యక్తి ఇప్పుడు గురివింద నీతులు చెబుతున్నాడు. రెండేళ్లుగా జరిగన ప్రతి ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించి కుళ్లబొడిచినా బాబు ముఠాకు బుద్ధి రాలేదు. రాష్ట్రంలో ఎవరూ ప్రశాంతంగా ఉండకూడదు. పారిపోయి పొరుగు రాష్ట్రంలో తలదాచుకుని అబద్దాల యంత్రాల్లా దుష్ప్రచారాలు సాగిస్తున్నారు. పైశాచికానందం పొందడం మినహా ఏం సాధిస్తారు?” అని వరుస ట్వీట్లతో ధ్వజమెత్తారు విజయసాయిరెడ్డి. కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రజల జీవితాలను నాశనం చేస్తుంటే.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని కంటికి కనిపించే నారా వైరస్ నాశనం చేస్తోందని అన్నారాయన.

ఏపీలో కొత్త వేరియంట్ ప్రబలిందని, దాని వల్ల ఎక్కువగా ప్రాణ నష్టం జరిగిందంటూ ఇటీవల చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే ఇలాంటి గోబెల్స్ ప్రచారంతో రాష్ట్రం పరువు తీయొద్దని అధికార పక్షం చంద్రబాబుపై ప్రతిదాడికి దిగింది. సీసీఎంబీ సైతం.. కొత్త వేరియంటే లేదని చెబుతుంటే చంద్రబాబు నీఛ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రులు. ఈ క్రమంలో నారా420 వైరస్ అంటూ బాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు పేల్చారు.