ఏపీ ప్రజలపై చంద్రబాబుకి పగ అందుకే..

ఎన్నికల్లో తన పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారనే చంద్రబాబు ఏపీ ప్రజలపై పగ పెంచుకున్నారని మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అలా పగ పెంచుకునే ఆయన ఏపీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని అన్నారు. చంద్రబాబు కృతజ్ఞత లేని మనిషని విమర్శించారు.

“అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్లకు ఎదిగావు. పచ్చ మాఫియాను సృష్టించి రాష్ట్రాన్ని రాబందుల్లా పీక్కుతినమని వదిలి పెట్టావు. ఓడించినందుకు ప్రజలపై పగ పెంచుకుని ఏపీ ప్రతిష్టనే దెబ్బతీసే కుట్రలు చేస్తున్నావు. ఎంత కృతజ్ఞత లేని వాడివి నీవు…చంద్రం.” అంటూ ట్విట్టర్ లో ధ్వజమెత్తారు విజయసాయిరెడ్డి.

” రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు 309 కోట్లు కేటాయించి, సీఎం జగన్ ప్రజల పట్ల తనకున్న బాధ్యతను చాటుకున్నారు. 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాలతో పాటు 50 క్రయోజనిక్ ట్యాంకర్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇక ప్రాణవాయవుకు కొరత ఉండదు.” అని చెప్పారు.

చంద్రబాబుకి అందరితోనూ సమస్య ఉందని, ఆయనకు రాష్ట్ర ప్రభుత్వంతో, పోలీసు వ్యవస్థతో, అధికార వ్యవస్థతో, చివరికి ప్రజలతో కూడా ఆయనకు సమస్యేనంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. ప్రస్తుతం ఆయన సొంత పార్టీ నేతలతోనే ఆయనకు సమస్య ఉందని చెప్పారు. ” చివరకు తేలిందేంటంటే.. చంద్రబాబు తనకు తానే పెద్ద సమస్యగా మారిపోయారు ఆయన్ను పక్కనపెడితే శాంతి, అభివృద్ధి, సంక్షేమం.. వీటన్నిటికీ ఎక్కడా లోటు లేదు.” అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.