బెంగాల్ లో పూర్తి స్థాయి లాక్ డౌన్..

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. రేపు ఆదివారం నుంచి ఈనెల 30వరకు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉదయం 7గంటలనుంచి, 10 గంటల వరకు కేవలం 3 గంటలు మాత్రమే నిత్యావసరాలకోసం ప్రజలు బయటకు రావొచ్చని సూచించింది. ఏపీలో ఈ వెసులుబాటు 6 గంటలు కాగా, తెలంగాణలో 4 గంటలు మాత్రమే. అంతకంటే తక్కువగా ఇప్పుడు బెంగాల్ ప్రభుత్వం కేవలం 3 గంటల సడలింపుతో కఠినంగా లాక్ డౌన్ అమలు చేయబోతోంది.

వీటిపై నిషేధం..
– బస్సులు, అంతర్ రాష్ట్ర రైళ్లు, మెట్రో రైళ్లు, ప్రజా రవాణాపై పూర్తి నిషేధం.
– పరిశ్రమలకు మూత.
– మతపరమైన సమావేశాలు, ఇతర అన్ని సమావేశాలపై నిషేధం.
– విద్యా సంస్థల కార్యకలాపాలపై నిషేధం.

మినహాయింపులు
– ఉదయం 7 గంటలనుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కొనుగోళ్లకు వెసులుబాలు.
– టీ తోటల్లో 50 శాతం పనివాళ్లకు అనుమతి
– జనపనార మిల్లుల్లో 30శాతం కార్మికులతో పనులు చేసుకునేలా అనుమతి
– ఎమర్జెన్సీ సర్వీసెస్ కు మినహాయింపు

దేశవ్యాప్తంగా 80శాతం కేసులు నమోదవుతున్న 12 రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్ కూడా ఒకటి. అక్కడ రోజువారీ 20వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఎనిమిది దశల్లో జరిగిన సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ వల్ల బెంగాల్ లో కరోనా విస్తృతమైందనే విమర్శలున్నాయి. ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలతో కోరనా వ్యాప్తి పెరిగింది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త వెసులుబాటు తీసుకుని రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు సీఎం మమతా బెనర్జీ.

మమత ఇంట విషాదం..
మరోవైపు సీఎం మమతా బెనర్జీ సోదరుడు ఆశిమ్ బెనర్జీ కొవిడ్ తో మృతిచెందారు. ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన ఆయనను కోల్ కతాలోని మెడికా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స తీసుకుంటుండగానే, సడన్ గా ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారి ఆయన మృతిచెందాడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.