పవన్ ప్లానింగ్ అర్థం కావడం లేదు

ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. పవన్ ప్లానింగ్ ఏంటో అస్సలు అర్థం
కావడం లేదంటూ మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం పవన్ కల్యాణ్ కాల్షీట్లు కేటాయిస్తున్న విధానం.

ప్రస్తుతం పవన్ చేతిలో 2 సినిమాలున్నాయి. సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియమ్
రీమేక్ చేస్తున్నాడు పవన్. అదే టైమ్ లో క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు.
కరోనా పరిస్థితులు చల్లారిన తర్వాత ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి సెట్స్ పైకి రావాలి. కుదిరితే రెండు
సినిమాల్ని సమాంతరంగా పూర్తిచేసే ప్లాన్ లో కూడా పవన్ ఉన్నట్టు అప్పట్లో కథనాలు వచ్చాయి.

అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ, పవన్ కల్యాణ్ మరో సినిమాకు కాల్షీట్లు కేటాయించాడు. అదే హరీశ్
శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా. కరోనా కల్లోలం తగ్గితే, వచ్చే నెల నుంచి ఈ సినిమా కోసం 2
వారాలు వర్క్ చేయడానికి పవన్ అంగీకరించాడు.

ఒకవేళ పవన్ సెట్స్ పైకి వస్తే అతడితో సినిమాకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సన్నివేశాలు
తీస్తానని కూడా హరీష్ ప్రకటించడం గమనార్హం. ఒకవైపు సెట్స్ పై ఉన్న 2 సినిమాల్ని పక్కనపెట్టి, ఫ్రెష్
గా మరో సినిమాకు పవన్ కాల్షీట్లు ఇవ్వడంతో ఫ్యాన్స్ కు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. పవన్ ప్లానింగ్
ఏంటో విచిత్రంగా ఉందంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.