వ్యాక్సిన్​ వేయించుకుంటే సంతానం కష్టమే? అమెరికాలో ప్రచారం..!

కరోనా వ్యాక్సిన్​ మీద చాలా రోజులుగా దుష్ప్రచారాలు సాగుతున్న విషయం తెలిసిందే. పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్​ తీసుకున్న వాళ్లు చనిపోయారని కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు వ్యాక్సిన్​ తీసుకుంటే ఎటువంటి దుష్పరిణామాలు ఉండవని.. కరోనాను తట్టుకొనే శక్తి వస్తుందని చాలా రోజులుగా శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ సోషల్​ మీడియా పుణ్యమా అని తప్పుడు ప్రచారమే ఎక్కువగా సాగుతోంది.

భారత్​లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే అయితే.. ఇక్కడ వ్యాక్సినేషన్​ ప్రక్రియ సజావుగా సాగనందువల్లే కేసులు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

తాజాగా అమెరికాలో అందరికీ వ్యాక్సినేషన్​ ఇస్తున్నారు. అక్కడ ప్రస్తుతం 18 నుంచి 49 ఏళ్ల మ‌ధ్య ఉన్న అమెరికన్లకు వ్యాక్సినేషన్​ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. వ్యాక్సిన్​ తీసుకున్న వాళ్లు మాస్కులు వాడాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం ప్రకటించింది.

ఇదిలా ఉంటే వ్యాక్సిన్​ తీసుకుంటే సంతానప్రాప్తిని కోల్పేయే అవకాశంఉందని అమెరికాలో ప్రచారం ఊపందుకున్నది. ముఖ్యంగా సోషల్​ మీడియాలో ఈ తరహా ప్రచారం ఎక్కువగా సాగుతోంది. దీంతో చాలా మంది ఈ ప్రచారాన్ని నమ్మి వ్యాక్సిన్​ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.
ఈ విషయంపై కైస‌ర్ ఫామిలీ ఫౌండేష‌న్ ఓ సర్వే నిర్వహించింది.

‘అమెరికాలో చాలా మంది వ్యాక్సిన్ తీసుకుంటే తమకు సంతానం కలగదేమోనని భయపడుతున్నారు. అందుకే వ్యాక్సిన్​ తీసుకోవడం లేదు’ అని కైస‌ర్ ఫామిలీ ఫౌండేష‌న్ డైర‌క్ట‌ర్ అష్లే కిర్‌జింగ‌ర్ పేర్కొన్నారు. 18 నుంచి 49 సంవత్సరాల వయసు గల స్త్రీలలో 50 శాతం, పురుషులలో 47 శాతం మంది వ్యాక్సిన్​ తీసుకోవడానికి భయపడుతున్నారట.

అయితే వ్యాక్సిన్ తీసుకుంటే సంతానం కలగదని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ అక్కడి ప్రజలు సోషల్​ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్నే నమ్మడం గమనార్హం. నిజానికి అమెరికా అభివృద్ధి చెందిన దేశం. అక్కడ విద్యావంతులు ఎక్కువగా ఉంటారు. అటువంటి దేశంలో కూడా తప్పుడు ప్రచారాలనే ప్రజలు నమ్ముతుండటం ఆశ్చర్యంగా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.