ప్రతిపక్ష నేతలతో సలహామండలి.. రాజకీయాల్లో స్టాలిన్​ సంచలనం..!

ఇటీవల తమిళనాడులో అధికారం చేపట్టిన స్టాలిన్​ విభిన్నతరహాలో రాజకీయం చేస్తున్నారు. సహజంగానే రాజకీయాలు అంటేనే కక్షలు.. ప్రత్యర్థి పార్టీని వెంటాడటం చూస్తుంటాం. ఇక తమిళనాడులో అటువంటి రాజకీయాలు కాస్త ఎక్కువగా ఉంటాయి.

గతంలో జయలలిత, కరుణానిధి మధ్య యుద్ధ వాతావరణం ఉండేది. కానీ తాజాగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్​ మాత్రం విభిన్న తరహాలో రాజకీయాలు చేస్తున్నారు. తమిళనాడులో ఉండే సహజ పరిస్థితులకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలను గౌరవిస్తున్నారు.

తాజాగా కోవిడ్ పై చర్యలు తీసుకొనేందుకు స్టాలిన్​ ఓ సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఇందులో స్టాలిన్ మరో సభ్యుడు తప్ప మిగిలిన వారంతా ప్రతిపక్ష పార్టీల నేతలే కావడం గమనార్హం. కోవిడ్‌పై పోరాటానికి మొత్తం 13 మంది ఎమ్మెల్యేలతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఇందులో 12 ప్రతిపక్ష పార్టీల నేతలే ఉన్నారు.

అన్నా డీఎంకే నేత, ఆరోగ్యశాఖ మాజీ మంత్రికి కూడా కమిటీలో స్థానం కల్పించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే అన్నా డీఎంకే, డీఎంకే మధ్య దశబ్దాలుగా రాజకీయ వైరం కొనసాగుతోంది. అటువంటి పార్టీకి కూడా స్టాలిన్ కమిటీలో చోటు కల్పించాడు.

ఈ కమిటీలో డాక్టర్ ఎజిలన్ (డీఎంకే), డాక్టర్ విజయభాస్కర్ (ఏఐడీఎంకే), జీకే మణి (పీఎంకే), ఏఎం మణిరత్నం (కాంగ్రెస్), నగర్ నాగేంద్రన్ (బీజేపీ), సుశాన్ తిరుమలైకుమార్ (ఎండీఎంకే), ఎస్ఎస్ బాలాజీ (వీసీకే), టీ రామచంద్రన్ (సీపీఐ), డాక్టర్ జవహారుల్లా (ఎంఎంకే), ఆర్ ఈశ్వరన్ (కేఎండీకే), టీ వేల్మురుగన్ (టీవీకే), పూవై జగన్ మూర్తి (పీబీ), నాగై మాలి (సీపీఎం) సభ్యులుగా కొనసాగనున్నారు.

స్టాలిన్​ గత రాజకీయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ కక్షలను పక్కకుపెట్టి.. ప్రతిపక్ష పార్టీల నేతలను కూడా కోవిడ్​ సంక్షోభంలో భాగస్వామ్యం చేస్తుండటంతో ఆయనకు అంతటా ప్రశంసలు దక్కుతున్నాయి.