‘కొత్త పాలసీ’ తీసుకోవాల్సిందే.. లేదంటే సేవలు కట్​..! వాట్సాప్​ స్పష్టీకరణ

వాట్సాప్​ నూతన ప్రైవసీ పాలసీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో చాలామంది వాట్సాప్​ను అన్​ ఇన్​స్టాల్​ చేసుకున్నారు కూడా.. వాట్సాప్​ స్థానంలో సిగ్నల్​, టెలీగ్రామ్​ లాంటి యాప్స్​కు డౌన్​లోడ్స్​ పెరిగాయి. దీంతో కొంచెం వెనక్కితగ్గినట్టు కనిపించిన వాట్సాప్​ .. ఆ తర్వాత మాత్రం మళ్లీ రెచ్చిపోయింది. ప్రతి ఒక్కరూ కొత్త నిబంధనలు అంగీకరించాల్సిందేనని.. లేదంటే వాళ్ల ఖాతాలను దశలవారీగా తొలగిస్తామంటూ స్పష్టం చేసింది.

అయితే ఇందుకు సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. వాట్సాప్​ తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్​ వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఎవరైనా వాట్సాప్​ నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించాల్సిందేనని తేల్చిచెప్పారు. అలా చేయని పక్షంలో దశల వారీగా వాళ్ల అకౌంట్లను తొలగిస్తామని స్పష్టం చేశారు.

వాట్సాప్​ ఐటీ నిబంధనల ప్రకారమే కొత్త రూల్స్​ తీసుకొచ్చిందని ఆయన కోర్టుకు విన్నవించారు.
ప్రైవసీ పాలసీని వాయిదా వేయడం కుదరదని ఆయన కుండబద్దలు కొట్టారు. తాము పూర్తిగా నిబంధనల ప్రకారమే వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. వాట్సాప్​ కొత్త విధానంతో చాలా ఇబ్బందులు ఉన్నాయని .. దేశవ్యాప్తంగా ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్(2000) లోని కొన్ని నిబంధనలను వాట్సాప్​ ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ఈ విషయంపైనే అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన్‌ శర్మ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. వాట్సాప్ యథాతథ స్థితిని కొనసాగించాలని చేతన్ శర్మ, పిటీషనర్లు కోరారు. అయితే కోర్టు ఇందుకు నిరాకరించింది. ఇందుకు సంబంధించిన విచారణను జూన్​ 3కు వాయిదా వేసింది.