తీరం తాకిన తౌక్టే.. ఐదు రాష్ట్రాలకు భారీ నష్టం..

అరేబియా సముద్రంతో పోల్చి చూస్తే తుపానులు, వాయుగుండాలు.. బంగాళాఖాతంలోనే ఎక్కువ. తూర్పు తీరాన్నే ఎప్పుడూ జలవిలయం ముంచెత్తుతుంటుంది. అయితే ఈ ఏడాది భారత్ లో తొలి తుపాను తౌక్టే.. పశ్చిమ తీరాన్ని వణికించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుపాను తీరం తాకే సమయానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. గుజరాత్ లోని పోర్ బందర్ సమీపంలో తీరం దాటిన తౌక్టే.. ఏకంగా 14మందిని బలితీసుకుంది. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని సమాచారం.

గోవా, కేరళ రాష్ట్రాలు తుపాను ధాటికి విలవిల్లాడాయి. ఎక్కడికక్కడ చెట్లు కూలిపోయాయి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో, తీర ప్రాంతం కోతకు గురైంది, తీవ్ర నష్టం ఎదురైంది. ఓవైపు కరోనా విలయం, మరోవైపు తుపాను ప్రభావంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ముంబై తీరంలో 2 భారీ నౌకలు, లంగర్లు తెగిపోయి సముద్రంలో కొట్టుకుపోయాయి. వాటి రక్షణకోసం మూడు యుద్ధ నౌకల్ని కేంద్రం రంగంలోకి దింపింది. అయితే కొట్టుకుపోయిన నౌకలు, వాటిలోని 410 మంది సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సముద్రంలో చిక్కుకుపోయిన 12మంది మత్స్యకారుల్ని కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు.

తుపాను తీరం దాటే సమయానికి మహారాష్ట్ర, గుజరాత్ లపై ప్రభావం ఎక్కువగా కనిపించింది. వాతావరణ శాఖ అధికారులు వేసిన అంచనా కంటే నష్టం అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముంబై విమానాశ్రయంలో కొన్నిగంటలసేపు రాకపోకలు స్తంభించాయి. ఏకంగా 55 విమాన సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చింది. గంటకు 185కిలోమీటర్ల వేగంతో భారీ గాలులతో తౌక్టే విరుచుకుపడింది. ఒక్క గుజరాత్‌ రాష్ట్రం లోనే 2 లక్షలమంది ప్రజల్ని లోతట్టు ప్రాంతాలనుంచి తరలించాల్సి వచ్చింది. గుజరాత్ పోర్ బందర్ ప్రాంతంలో కరోనా రోగుల్ని హుటాహుటిన సురక్షిత ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తరలించారు. గుజరాత్ భావ్ నగర్ జిల్లాలోని ఘోఘా ఓడరేవులో 9వ నంబరు అతి ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. ఇటీవల కాలంలో ఈ ప్రమాద హెచ్చరిక ఎగురవేయడం ఇదే తొలిసారి అంటున్నారు. అహ్మదాబాద్‌, సూరత్‌, రాజ్‌ కోట్‌ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకల్ని రెండు రోజులపాటు రద్దు చేశారు.

రాయలసీమపై ప్రభావం ఉంటుందని అంచనా వేసినా.. ఏపీలో పెద్దగా వర్షాలు పడలేదు. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో అకాల వర్షాలకు మామిడి రైతులు నష్టపోయారు. అటు తమిళనాడుపై కూడా తుపాను ప్రభావం తక్కువగానే ఉంది. కేరళ, కర్నాటక, గోవా, గుజరాత్, మహారాష్ట్ర.. తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయాయి.