ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్‌ లేఖ.. అందులో ఏముందంటే..

ఇటీవల కరోనా బారిన పడిన జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు లేఖ రాశారు. మే 20న తన పుట్టిన రోజు సందర్బంగా ఎలాంటి వేడుకలు చేయొద్దని కోరారు. కర్ఫ్యూ, కోవిడ్ రూల్స్ పాటిస్తూ అందరూ ఇంట్లోనే ఉండాలని సూచించారు.

“నా అభిమానులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను?

ప్రస్తుతం నేను బాగున్నాను. త్వరలో పూర్తిగా కోలుకుని కోవిడ్‌ను జయిస్తాను అని ఆశిస్తున్నాను. ప్రతి ఏటా మీరు నా పుట్టిన రోజున చూపే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. కానీ ఈ సంవత్సరం మీరు ఇంటి పట్టునే ఉంటూ, లాక్‌డౌన్, కర్ఫ్యూ నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే మీరు నాకు అందించే అతి పెద్ద కానుక.

ఇది వేడుకలను చేసుకునే సమయం కాదు. మనదేశం కరోనాతో యుద్ధం చేస్తోంది. కనిపించని శత్రువుతో అలుపెరగని పోరాటం చేస్తున్న మన డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మన సంఘీభావం తెలపాలి. ఎందరో తమ ప్రాణాలను, జీవనోపాధిని కోల్పోయారు. ఆ కుటుంబాలకు కుదిరితే అండగా నిలబడాలి.

మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ చేతనైన ఉపకారం చేయండి. త్వరలో మన దేశం ఈ కరోనాను జయిస్తుంది అని నమ్ముతున్నాను. ఆ రోజున అందరం కలిసి వేడుక చేసుకుందాం. అప్పటివరకు మాస్క్ ధరించండి, జాగ్రత్తగా ఉండండి” అంటూ తన ట్విట్టర్ లో లెటర్ పోస్ట్ చేశారు