”ఏక్ మినీ కథ” మూవీ రివ్యూ

నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య థాపర్, శ్రద్దా దాస్, సుదర్శన్, బ్రహ్మాజీ, సప్తగిరి, పోసాని, హర్ష వర్దన్, జీవన్ తదితరులు.
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి
ఎడిటింగ్ : సత్య
క‌థ‌ -మాటలు: మేర్లపాక గాంధీ
నిర్మాణం: యూవీ కాన్సెప్ట్స్
దర్శకత్వం : కార్తీక్ రాపోలు
రిలీజ్ డేట్ : 26 మే 2021
వేదిక: అమెజాన్ ప్రైమ్
రేటింగ్: 2.25/5

ఓటీటీ వచ్చిన తర్వాత తెలుగు మూవీ కంటెంట్ కొత్త పుంతలు తొక్కుతోంది. కాదేదీ సినిమాకు అనర్హం
అనే రీతిలో వెరైటీ కథలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఎన్ని కథలొచ్చినా మరీ ఇలాంటి కథ ఒకటి
వస్తుందని, సినిమా మొత్తం దాని చుట్టూరానే తిరుగుతుందని సగటు తెలుగు ప్రేక్షకుడు కలలో కూడా
ఊహించి ఉండదు. అదే ఏక్ మినీ కథ. ఈ సినిమా కథ మొత్తం పురుషాంగం చుట్టూ తిరుగుతుంది మరి.

ఇదేదో సినిమాలో ఒక ఎలిమెంట్ లేదా ఓ భాగం అయితే సర్లే అని సర్దుకోవచ్చు. కానీ సినిమా అంతా ఇదే.
ఓపెనింగ్ నుంచి శుభం కార్డు వరకు ప్రైవేట్ పార్ట్ సైజ్ ను పెంచుకోవడం ఎలా అనే అంశంపై కథ
తిరుగుతుంది. 2 గంటల 14 నిమిషాల ఈ సినిమాలో ఇదే ప్రధాన ఇతివృత్తం. అయితే ఇలాంటి బోల్డ్
కథలో సందేశాన్ని ఇవ్వాలని అనుకోకపోవడం మెచ్చుకోదగ్గ విషయం. దీన్ని వీలైనంత సరదాగా చెబుతూ,
చూపెడుతూ టైమ్ పాస్ చేద్దామని మేకర్స్ ప్రయత్నించడం బాగుంది.

హీరోకు ఆ ప్రైవేట్ పార్ట్ చిన్నది. ఆ విషయాన్ని ఏడో తరగతిలోనే తెలుసుకుంటాడు మన హీరో.
అప్పట్నుంచి దాన్ని పెద్దది చేసుకోవడం ఎలా అనే ఆలోచనలోనే ఉంటాడు. దీనికితోడు ఇంజినీరింగ్ కు
వచ్చేసరికి గర్ల్ ఫ్రెండ్ దగ్గర దొరికిపోతాడు. ఇక అప్పట్నుంచి “సైజు పెంచుకోవడం ఎలా” అనే
అంశంపైనే హీరో ప్రయత్నాలన్నీ. ఈ క్రమంలో హీరో ఓ అమ్మాయి ప్రేమలో పడడం, ఆ అమ్మాయితో పెళ్లి
జరగడం కూడా అయిపోతాయి. చిన్న సైజు ప్రైవేట్ పార్ట్ తో హీరోగారు ఎలా క్లైమాక్స్ వరకు వచ్చారు,
చివరికి హీరో తెలుసుకున్నదేంటి అనేది ఈ సినిమా స్టోరీ.

పేరుకు తగ్గట్టే ఇది మినీ స్టోరీ. ఇంత చిన్న స్టోరీ లైన్ ను మహా అయితే షార్ట్ ఫిలింగా తీయొచ్చు,
అలాంటిది దీన్ని ఏకంగా ఫీచర్ ఫిలింగా తీసిన మేకర్స్ ను మెచ్చుకోవాలి. ఈ విషయంలో కథ, స్క్రీన్ ప్లే,
మాటలు అందించిన మేర్లపాక గాంధీని మెచ్చుకోకుండా ఉండలేం. అతడి ఆలోచనను, భావాన్ని అర్థం
చేసుకొని, అంతే చక్కగా డైరక్ట్ చేశాడు కార్తీక్ రాపోలు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం, సత్య ఎడిటింగ్ దీనికి
బాగా కుదిరాయి. ఇక నిర్మాణ సంస్థ విషయానికొస్తే.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అతి చిన్న బడ్జెట్
సినిమా ఇదే. కానీ కథకు తగ్గట్టు కాంప్రమైజ్ అవ్వకుండా పెట్టారు.

నటీనటుల విషయానికొస్తే.. హీరో సంతోష్ శోభన్ చాలా బాగా చేశాడు. ప్రైవేట్ పార్ట్ చిన్నగా ఉందనే
బాధను తన కళ్లలోనే పలికించాడు. దీనికితోడు అతడి కామెడీ టైమింగ్ కూడా బాగా సెట్ అయింది. ఇక
సినిమా ఆసాంతం హీరో పక్కనుండే సుదర్శన్ తన కామెడీ పంచ్ లతో నవ్వించాడు. బ్రహ్మాజీ, సప్తగిరి,
పోసాని తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎప్పటికప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించే
పాత్రలో నటించిన వ్యక్తి బాగా చేశాడు. హీరోయిన్ కావ్య థాపర్ ఫర్వాలేదనిపించుకుంది. మరో హీరోయిన్ శ్రద్ధా దాస్ నుంచి అందాల ఆరబోత ఆశిస్తే అత్యాశే అవుతుంది.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు చిన్న పాయింట్ తో ఇంత పెద్ద సినిమా తీయడం కత్తిమీద సాములాంటి
వ్యవహారమే. ఆ విషయంలో మేకర్స్ ను మెచ్చుకోవచ్చు. ఎలాంటి ట్విస్టులు లేకుండా ఏదో సింపుల్ గా
నడిచే ఈ మినీ కథలో క్యారెక్టర్స్ ద్వారా మంచి కామెడీ పుట్టించి సినిమాను ఎంటర్టైన్ మెంట్ దారిలోకి
తీసుకెళ్ళి సరదాగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ కథకి యాడ్ చేసిన కామెడీ ట్రాక్స్ బాగానే పేలాయి.
అదే సినిమాను ఉన్నంతలో కాపాడింది. కొంచెం బోర్ కొట్టినప్పటికీ సినిమాను చూడగలం అంటే దానికి
రీజన్ కామెడీ ఒక్కటే అని చెప్పొచ్చు.

థియేటర్స్ కోసం తీసి తప్పని పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేశాం అనే పడికట్టు డైలాగులు ఈ సినిమా
విషయంలో చెల్లవు. ఎందుకంటే, ఇది పక్కా ఓటీటీ సినిమా. ఎవరికి వాళ్లు ప్రైవేటుగా ఈ ”ప్రైవేటు పార్ట్”
సినిమాను చూసి నవ్వుకోవాల్సిందే.

బాటమ్ లైన్ – అంతా ”ప్రైవేట్” వ్యవహారమే