ఎన్నికోట్లు ఖర్చు చేసినా లోకేష్ కి జ్ఞానం రాదు.. -విజయసాయి

కొడుకు లోకేష్ పై తనకున్న పిచ్చి ప్రేమతో చంద్రబాబు కోట్ల రూపాయలు వృథా చేసుకుంటున్నారని సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. లోకేష్ కి లోక జ్ఞానం తెప్పించేందుకు కోట్లు ఖర్చు చేస్తూ ట్రైనింగ్ క్లాస్లు ఇప్పిస్తున్నారని అన్నారు. అసాధ్యం అని తెలిసి కూడా కొడుకు విషయంలో చంద్రబాబు వృథాప్రయాస పడుతున్నారని, ఎంతమంది చెప్పినా తన పట్టు వీడటంలేదని, జ్ఞానం ఎవరో నేర్పిస్తే వచ్చేది కాదని హితబోధ చేశారు విజయసాయిరెడ్డి.

టీడీపీకి అందుకే అభ్యర్థులు క‌రువు..
వైసీపీ రెండేళ్ల పాలనపై చంద్రబాబు చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టారు విజయసాయిరెడ్డి. జగన్ రెండేళ్ల పాలనకే టీడీపీ అడ్రస్ గల్లంతయిందని, అందుకే వారికి స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకలేదని విమర్శించారు.

“రెండేళ్లలో సీఎం జగన్ ఏం చేయక పోతే 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన పచ్చపార్టీ అడ్రసు లేకుండా ఎందుకు పోతుంది? పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దరిద్రం ఎందుకు పట్టుకుంటుంది. వచ్చే మూడేళ్లలో యువ సీఎం నాయకత్వంలో ఇంకా అద్భుతాలు జరుగుతాయి.” అని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

పరాజయంపాలై రెండేళ్లు గడిచినా చంద్రబాబులో ఇంకా పరివర్తన రాలేదని అన్నారు విజయసాయిరెడ్డి. ఇప్పటికీ టీడీపీ ఎందుకు ఓడిపోయిందో తెలియదని అంటున్న చంద్రబాబు, తనను అర్థం చేసుకొనే శక్తిలేకే ఓడించారంటూ ప్రజలపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎగ్జామ్ బాగా రాసినా పేపర్లు దిద్దిన టీచర్ కావాలనే తనను ఫెయిల్ చేశారని ఏడ్చే విద్యార్థిలాగా చంద్రబాబు వ్యవహారం ఉందని అన్నారు.