మెగా కోవిడ్ వారియర్ మేఘా..

కరోనా కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలబడింది మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ సంస్థ. ఆక్సిజన్ సరఫరాతోపాటు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తాత్కాలిక కొవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, అక్కడి అవసరాలను తీరుస్తోంది. ప్రభుత్వానికి సాయంగా తన వంతు సామాజిక బాధ్యత నెరవేరుస్తోంది.

రికార్డు సమయంలో ఆస్పత్రి..
కరోనా రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్జాస్‌ స్టీల్‌ పరిశ్రమ వద్ద జర్మన్‌ హ్యాంగర్స్‌ విధానంలో 500 ఆక్సిజన్‌ పడకల తాత్కాలిక కోవిడ్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది మేఘా సంస్థ. సీఎం జగన్ ఈ ఆస్పత్రిని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈరోజు నుంచి ఇక్కడ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. కేవలం రెండు వారాల వ్యవధిలో 11.5 ఎకరాల విస్తీర్ణంలో, లక్ష చదరపు అడుగుల పరిధిలో ఈ ఆస్పత్రి ఏర్పాటైంది. ఇందులోని 500 పడకలకూ ఆక్సిజన్‌ సదుపాయం ఉంది. అనంతపురం జిల్లాతో పాటు కడప, కర్నూలు జిల్లాలకు చెందిన రోగులకు ఇక్కడ బెడ్లు కేటాయిస్తారు.

ప్రతి బెడ్ కు ఆక్సిజన్ ఏర్పాటు..
ప్రతి పేషెంట్‌ బెడ్‌ వద్ద ఆక్సిజన్, ప్రతి 30 బెడ్లకు ఓ నర్సింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు. 500 బెడ్లు ఉన్న ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాకు 15 ఎంఎం పైప్ లైన్, 22, 28 ఎంఎం డయా పైప్ ద్వారా ప్రెజర్ గ్యాస్ సమకూర్చింది మేఘా సంస్థ. ఆక్సిజన్ సరఫరాకు అవసరమైన అవుట్‌ లెట్లు, ఫ్లోమీటర్లతో సహా అవసరమైన ప్రెజర్ గేజ్‌లను ఏర్పాటు చేసింది. ప్రతీ బెడ్ కు ఎల్-గేజ్ తో పాటు హ్యూమిడిఫైయర్, ఫ్లో మీటర్ అమర్చారు. స్టాండ్ బై గా కంట్రోల్ ప్యానెల్ వద్ద 3 మ్యానీఫోల్డ్ మిషన్లు కూడా అమర్చారు. 200 మంది నర్సులు, 50 మందికి పైగా వైద్యులు.. మొత్తం 350 మందికి పైగా వైద్య సిబ్బంది ఇక్కడ సేవలందిస్తారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో తాత్కాలిక కొవిడ్ కేంద్రాల ఏర్పాటు..
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 300 పడకల తాత్కాలిక కోవిడ్ కేంద్రం ఏర్పాటు చేసింది మేఘా సంస్థ. ఈ ఆస్పత్రికి అవసరమైన ఆక్సిజన్ కోసం 15 ఎంఎం పైప్ లైన్, 22, 28 ఎంఎం డయా పైపులు ఏర్పాటు చేశారు. కంట్రోల్ ఫోల్డ్ లో రెండు మ్యానిఫోల్డ్ లు ఉంచారు.

చిత్తూరు జిల్లాలో 80పడకల ఆస్పత్రి
అటు చిత్తూరు జిల్లా పుంగనూరులో 80పడకల కొవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేశారు. కొవిడ్ ఆస్పత్రిలో కంట్రోల్ ప్యానల్ ఏర్పాటు చేశారు. 15 ఎంఎం పైప్ లైన్, 22, 28 ఎంఎం డయా పైపులతో ఇక్కడ నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేస్తారు.

పెద్దాపురంలో ఆక్సిజన్ ప్లాంట్ పునరుద్ధరణ..
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలోని ఆక్సిజన్‌ ప్లాంట్‌ ను మేఘా సంస్థ పునరుద్ధరిస్తోంది. ఇక్కడ రోజుకు 5 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తారు. ప్లాంట్ పునరుద్ధరణకు కావాల్సిన ఎయిర్‌ కంప్రెషర్, పైపులు, ఎయిర్‌ సెపరేషన్ యూనిట్‌ లో వాడే విడిభాగాలు తెప్పిస్తోంది. పెద్దాపురం ప్లాంట్‌ లో ఈనెల 12 నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యేలా పనులను వేగవంతం చేసింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాలకు సరఫరా చేసేందుకు సింగపూర్‌ నుంచి క్రయోజనిక్‌ ట్యాంకులను కూడా తెప్పించింది మేఘా సంస్థ. మూడు ట్యాంకులను దిగుమతి చేసి ఏపీ ప్రభుత్వానికి ఉచితంగా అందజేసింది.

కాగా, దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చేయూతనందిస్తూ మానవత్వాన్ని చాటుకుంది మేఘా సంస్థ. ఇటు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు రాష్ట్రానికి కూడా ఆక్సిజన్ సరఫరా చేసింది మేఘా సంస్థ. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆస్పత్రులను ఏర్పాటు చేసింది.