పవన్ కల్యాణ్ రెడీ అయ్యాడు

మొన్నటివరకు తిరుపతి ఉప ఎన్నికతో బిజీ అయ్యారు. ఆ తర్వాత కరోనా సోకి మంచాన పడ్డారు. ఈ మధ్యలో లాక్ డౌన్ పడ్డంతో షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. అలా తన సినిమాలకు సుదీర్ఘ విరామం ఇచ్చిన పవన్ కల్యాణ్, ఇప్పుడు మరోసారి తన సినిమాలపై దృష్టిపెట్టారు. తాజా సమాచారం ప్రకారం.. ఆగస్ట్ నుంచి అన్ని సినిమాల్ని సెట్స్ పైకి తీసుకురావడానికి పవన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం పవన్ చేతిలో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో పాటు.. హరిహర వీరమల్లు సినిమాలున్నాయి. ఈ రెండు సినిమాల్ని ఆగస్ట్ నుంచి ఒకేసారి సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నారు పవన్. వీటిలో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కు తక్కువ కాల్షీట్లు ఇస్తే సరిపోతుంది. అందుకే తొలి ప్రాధాన్యంగా దాన్ని పూర్తిచేసి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో హరిహర వీరమల్లు సినిమాపై దృష్టి పెట్టాలని పవన్ ప్రాధమికంగా నిర్ణయించారు.

ఈ రెండు సినిమాల్ని వీలైనంత తొందరగా పూర్తిచేసి, ఆ తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమా స్టార్ట్ చేస్తారు పవన్. అప్పటికి పవన్ ఖాతాలో అదనంగా మరో సినిమా వచ్చి చేరే అవకాశం ఉంది. అదేంటనేది త్వరలోనే తెలుస్తుంది.