అధికార ప్రతినిధులను నియమించిన షర్మిల..!

తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు వైఎస్​ షర్మిల వడివడిగా అడుగులు వేస్తున్నారు. షర్మిల కొత్తగా పెట్టబోయే పార్టీగా వైఎస్సార్​ టీపీగా పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఈ పార్టీకి షర్మిల.. అధికార ప్రతినిధులను నియమించారు.

కొండా రాఘవరెడ్డి, పిట్ట రాంరెడ్డి, ఇందిరా శోభన్, తూడి దేవేందర్‌రెడ్డి, ఏపూరి సోమన్న, సయ్యద్ ముజ్జబ్‌, మతిన్ ముజాదద్ది, భూంరెడ్డి, బీశ్వ రవీందర్‌ ను అధికార ప్రతినిధులుగా నియమిస్తూ షర్మిల నిర్ణయం తీసుకున్నారు.

షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్​ పార్టీ చైర్మన్​గా వ్యవహరించబోతున్నారు. ఇక త్వరలోనే వైఎస్సార్​టీపీ అనుసరించవలసిన వ్యూహాలు, భవిష్యత్​ కార్యాచరణను షర్మిల ప్రకటించబోతున్నారు. ఆమె పాదయాత్రకు సంబంధించిన రూట్​మ్యాప్​ను కూడా ఖారారు చేయబోతున్నారు.

నిరుద్యోగం సమస్యనే ఆమె ప్రధాన ఎజెండాగా ఉద్యమించబోతున్నారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమిటీలు వేయబోతున్నారు. హైదరాబాద్​, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్​నగర్​, ఖమ్మం జిల్లాల్లో పార్టీకి ఇప్పటికే కొంతమంది అనుచరులు ఉన్నారు. ఈ జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ.. మిగిలిన జిల్లాలకు కూడా పార్టీని తీసుకెళ్లాలని షర్మిల యోచిస్తున్నారు.

వరంగల్​, కరీంనగర్​, నిజామాబాద్​, ఆదిలాబాద్​ లాంటి జిల్లాల్లో షర్మిల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దళిత సామాజికవర్గం నుంచి షర్మిలకు పెద్ద ఎత్తున మద్దతు దక్కే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అది నిజమైతే కాంగ్రెస్​కు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లడం ఖాయం.

షర్మిల మాత్రం కాంగ్రెస్​, ఆ పార్టీ నాయకులపై పెద్దగా విమర్శలు చేయడం లేదు.. ఆమె నేరుగా సీఎం కేసీఆర్​నే టార్గెట్​ చేశారు. షర్మిల కోసం ప్రశాంత్​ కిషోర్​ టీంలోని కొందరు సభ్యులు పనిచేస్తున్నట్టు సమాచారం. వారి సూచనల ప్రకారమే.. షర్మిల రాజకీయంగా అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.