సువేందు అధికారిపై కేసు.. బెంగాల్​లో పొలిటికల్​ హీట్​..!

పశ్చిమబెంగాల్​ బీజేపీ నేత, నందిగ్రామ్​ ఎమ్మెల్యే సువేందు అధికారిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. టీఎంసీలో కీలక నేతగా ఎదిగిన అధికారి.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు ఆయన తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్​లో ఏకంగా టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీతో తలపడి విజయం సాధించారు.

ప్రస్తుతం సువేందు అధికారి అరెస్ట్​ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. పశ్చిమ బెంగాల్​లో టీఎంసీ గెలిచి .. మమతా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె కేంద్రప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు.

ప్రస్తుతం కేంద్రప్రభుత్వం వర్సెస్​ బెంగాల్​ రాష్ట్రప్రభుత్వం మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఇదిలా ఉంటే ఎన్నికల ముందు టీఎంసీ నుంచి బీజేపీలో చేరి ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఓడి పోయినవారు మళ్లీ టీఎంసీలో చేరబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే తాజాగా సువేందు అధికారిపై అక్కడి పోలీసులు కేసు నమోదుచేశారు. పశ్చిమ బెంగాల్ పూర్బ మేదినిపూర్ జిల్లా కాంతి మున్సిపాలిటీ కార్యాలయంలో సహాయ సామగ్రి (రిలీఫ్ మెటీరియల్)ని బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి, ఆయన సోదరుడు సౌమేందు అధికారి బలవంతంగా ఎత్తుకెళ్లినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన విషయంలోనే వీరిద్దరి మీద పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

కాంతి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బోర్డు సభ్యుడు రత్నదీప్ మన్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మే 29న సువేందు అధికారి, ఆయన సోదరుడు, కాంతి మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ చీఫ్ సౌమేందు అధికారి ఆదేశాల మేరకు అక్రమంగా మున్సిపాలిటీ గోదాము తాళాలు తెరిచి, సామగ్రిని చోరీ చేసినట్టు ఫిర్యాదుదారు ఆరోపించారు. ఈ సహాయ సామగ్రి విలువ లక్షలాది రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.