యోగీ సీటు కిందకి నీళ్లు.. యూపీలో ఏం జరుగుతోంది..?

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీటు కిందకు నీళ్లొస్తున్నాయా? ఇటీవల స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం దేనికి సంకేతం..? యూపీ వ్యవహారాలపై ఇద్దరు పరిశీలకుల్ని నియమించిన కేంద్రం దిద్దుబాటు చర్యల్లో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటుందా..? ప్రస్తుతం యూపీ వ్యవహారం బీజేపీ జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతకంటే పెద్ద హాట్ టాపిక్ ఏంటంటే.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ వేయకపోవడం. గతంలో ఆయన ఎనర్జిటిక్ సీఎం అని, కష్టపడే మనిషి అని, యూపీని అభివృద్ధిపథంలో నడుపుతున్నారంటూ ప్రతి ఏడాదీ ట్వీట్ తో విషెస్ చెప్పేవారు మోదీ. ఈ ఏడాది శుభాకాంక్షలు చెప్పకపోవడంతో.. యోగిని మోదీ పక్కనపెట్టారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వెంటనే బీజేపీ అధిష్టానం వివరణ ఇచ్చుకుంది. కరోనా కాలంలో సోషల్ మీడియా ద్వారా ప్రధాని ఎవరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంలేదని, అందుకే ఆయన ట్వీట్ వేయలేదని చెబుతున్నారు. ప్రధాని నేరుగా యోగికి ఫోన్ చేసి విష్ చేశారని, కావాలనే ప్రతిపక్షాలు ఈ విషయాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నాయని వారు అంటున్నారు.

యోగి-మోదీ ట్విట్టర్ పలకరింపుల సంగతి పక్కనపెడితే, యీపీపై బీజేపీ అధిష్టానం పూర్తిగా ఫోకస్ పెట్టిందనేమాట వాస్తవం. పార్టీ ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్, కేంద్ర మాజీ మంత్రి రాధా మోహన్ ఆధ్వర్యంలో ఓ కమిటీని యూపీ వ్యవహారాలు చూడటానికి పంపించింది. దీంతో యోగి సీటు కిందకు నీళ్లొచ్చాయని, సీఎం పదవిని వేరే వారికి అప్పగిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాలను ఖండించిన బి.ఎల్.సంతోష్.. కరోనా సెకండ్ వేవ్ ని యోగి సమర్థంగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు. అయితే యోగిపై నేరుగా ఒత్తిడి పెంచకుండా.. యోగి టీమ్ లో మార్పులు చేర్పులు జరగబోతున్నాయని బీజేపీ వర్గాల కథనం.

ప్రస్తుతానికి యూపీ ముఖ్యమంత్రి యోగి పనితీరుపై బీజేపీ అధిష్టానం పూర్తి అసంతృప్తిలో ఉందనేమాట వాస్తవం. మూకదాడులు, లవ్ జీహాద్ వంటి వ్యవహారాలతో యూపీలో యోగి నిరంకుశ పాలనకు చాలామంది వ్యతిరేకులు తయారయ్యారు. దీని ఫలితం స్థానిక ఎన్నికల్లో కనిపించింది కూడా. ఇక కరోనా కష్టకాలంలో యూపీలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఈ దశలో యూపీలో పరిస్థితులు చక్కదిద్దకపోతే ?అధికారం కోల్పోతామేమోననే భయం బీజేపీకి పట్టుకుంది. అందుకే ఇద్దరు సీనియర్ నేతల్ని యూపీకి పంపి పరిస్థితి అంచనా వేయాలని చెప్పారు. అధికారం నిలబెట్టుకోడానికి బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే సీఎం మార్పు వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారా? లేదా యోగి కేబినెట్ లో మార్పులు చేర్పులు చేస్తారా అనేది తేలాల్సి ఉంది.