రేపటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ..!

కృష్ణపట్నం ఆనందయ్య మందు ఎప్పుడు పంపిణీ చేస్తారు? ఇదో మిలియన్​ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కోర్టులు కూడా పంపిణీ చేయాలని ఆదేశించాయి. అయినా వివిధ కారణాలతో మందు పంపిణీ జరగడం లేదు. మరోవైపు అప్పుడే ఈ మందుపై రాజకీయం మొదలైంది. మాజీ మంత్రి సోమిరెడ్డి.. అధికార పార్టీ మందు అమ్ముకుంటుందని ఆరోపణలు చేశారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే కాకాణి స్ట్రాంగ్​గానే కౌంటర్​ ఇచ్చారు.

ఇదిలా ఉంటే మందు పంపిణీపై నేరుగా ఆనందయ్యే క్లారిటీ ఇచ్చేశారు. సోమవారం నుంచి మందు పంపిణీ (జూన్​ 7) ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం తయారీ ప్రక్రియ జరుగుతోందన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు మందుల కిట్లు పంపిణీ చేస్తామన్నారు. ఈ మేరకు ఆనందయ్య ఒక వీడియో విడుదల చేశారు.

తొలుత సొంత నియోజకవర్గమైన సర్వేపల్లిలో మందు పంపిణీ చేస్తామని .. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలకు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. మందు కోసం ఎవరూ నేరుగా కృష్ణపట్నం రావద్దని ఆయన కోరారు. సాధ్యమైనంత త్వరగా.. ఎక్కువ మందికి ఈ మందు పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఆనందయ్య మందు పంపిణీ ఆగిపోయిందని.. మందు పంపిణీని ప్రభుత్వమే నిలిపివేసిందంటూ నిన్న సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. దీంతో ఆనందయ్య మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చారు.