హైదరాబాద్ లో ఆకట్టుకున్న వ్యాక్సినేషన్ డ్రైవ్

ఒకేరోజు 40వేలమందికి వ్యాక్సిన్, అందరికీ ఒకేచోట వ్యాక్సినేషన్, ఒక్కొక్క‌రికి గరిష్టంగా 5 నిముషాలు మాత్రమే వెయిటింగ్ టైమ్. విదేశాల్లో కాదు, మన ఇండియాలోనే, హైదరాబాద్ లోని హైటెక్స్ ప్రాంగణంలో ఈ జంబో వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది. ఐటీ ఉద్యోగులు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండేవారు.. గత రెండు వారాలుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, ఈరోజు వ్యాక్సినేషన్ కి తరలి వచ్చారు. సింపుల్ గా పని ముగించుకుని వెళ్లిపోయారు. ఫస్ట్ షాట్ తీసుకున్నామంటూ సంబరంతో సోషల్ మీడియాలో ఫొటోలు అప్ లోడ్ చేస్తున్నారు.

ప్రభుత్వం ఆస్పత్రులు, ఇతర ఆఫీసుల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ క్యాంప్ లు ఎంత గందరగోళానికి దారి తీస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. పక్కా ప్లానింగ్ ప్రకారం టోకెన్లు ఇచ్చి అందర్నీ క్యూలైన్లలో పంపిస్తున్నా.. రద్దీమాత్రం భారీగా ఉంటోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం కొవిడ్ నిబంధనల ప్రకారమే వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ఓ కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యం చేపట్టింది. స్థానిక పోలీసుల సహకారంతో ఈ కార్యక్రమం సజావుగా సాగింది. ఐటీ కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీల నుంచి వెబ్ సైట్లో టీకా కోసం అప్లికేషన్లు స్వీకరించింది. అందరికీ టైమ్ స్లాట్ ఇచ్చేసింది. ఆదివారం ఫలానా టైమ్ కి ఫలానా చోటకి వచ్చేయండని చెప్పేసింది. ఎవరెవరు ఏ కౌంటర్ దగ్గరకి వెళ్లాలి, టేబుల్ నెంబర్ ఎంత, వ్యాక్సిన్ వేసేవారి పేరేంటి.. అన్ని వివరాలతో మెసేజ్ లు వెళ్లిపోయాయి. ఇంకేముంది, ఇలా వెళ్లి అలా వ్యాక్యిన్ వేయించుకుని వచ్చారంతా. ఎక్కడా గంరదగోళం లేదు, తొక్కిసలాట లేదు, హడావిడి లేదు. అందరూ కార్లలో రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వ్యాక్సినేషన్ తర్వాత అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు కూడా.

ప్రభుత్వ వ్యాక్సిన్ కౌంటర్లు గందరగోళానికి దారితీస్తున్నా.. ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ స్పెషల్ డ్రైవ్ మాత్రం సాఫీగా సాగడం విశేషం. ఇకపై ప్రభుత్వం కూడా ఇలాంటి స్పెషల్ డ్రైవ్ లు పెట్టాలని కోరుతున్నారు ప్రజలు. హైదరాబాద్ లో తొలిసారి ఏర్పాటు చేసిన ఈ జంబో స్పెషల్ డ్రైవ్.. రోల్ మోడల్ గా నిలుస్తుందని చెబుతున్నారు.