సీఎం జగన్​కు ఆనందయ్య లేఖ.. ఏం కోరారంటే?

కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య సీఎం జగన్​కు లేఖ రాశారు. మందు తయారీకి తనకు సహకరించాలని ఆయన లేఖలో కోరినట్టు సమాచారం. ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ వలంటీర్లు, కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి మందు పంపిణీ చేస్తున్నారు.

అయితే నెల్లూరు జిల్లా కృష్ణ పట్నానికి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. కానీ ఇతర ప్రాంతాల వారిని కృష్ణ పట్నానికి అనుమతి ఇవ్వడం లేదు. ఆ గ్రామంలో 144 సెక్షన్​ విధించారు. మరోవైపు మందు పంపిణీ చేయాలంటూ ఆనందయ్యకు.. ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన సీఎం జగన్​కు లేఖ రాశారు.

తనకు ముడి సరుకులు అందించాలని.. విద్యుత్ నిరంతరం అందుబాటులో ఉండేలా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆనందయ్య కోరినట్టు సమాచారం. మరోవైపు ఆనందయ్య తయారుచేసిన కే అనే మందుకు గతంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కానీ నిన్న కోర్టు సైతం ఈ మందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన మందు కోసం వివిధ రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.

అయితే ముడి సరుకులు అందుబాటులో లేకపోవడం సహా.. వివిధ కారణాలతో ఆయన భారీ మొత్తంలో మందును తయారుచేయలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆయన సీఎం జగన్​కు లేఖ రాయడం సంచలనంగా మారింది. మరోవైపు ఆనందయ్య కుమారుడు చంద్రగిరి నియోజకవర్గంలో మందును మందును తయారుచేస్తున్నారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే పంపిణీ చేస్తున్నారు.