థర్డ్ వేవ్ ని ఎదుర్కొనేందుకు ఏపీ అప్రమత్తం..

కరోనా మూడో దశ అనివార్యమైతే రాష్ట్రంలో 18 లక్షల మంది వైరస్‌ బారినపడే అవకాశముందని కొవిడ్‌-19 పీడియాట్రిక్స్‌ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్సు కమిటీ అంచనా వేసింది. ఈ 18 లక్షల మందిలో 18 ఏళ్లలోపు పిల్లలు 4.5 లక్షల మంది ఉంటారని కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో 8.35 శాతం మంది 20ఏళ్లలోపువారున్నారు. థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంలో కమిటీ ఇలా లెక్కలు కట్టింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్.. థర్డ్ వేవ్ సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవసరమైన ఏర్పాట్లకు ఆదేశాలిచ్చారు.

ఏపీ సన్నద్ధత ఇలా..
– పిల్లలకోసం విశాఖపట్నం, తిరుపతి, కృష్ణా-గుంటూరు జిల్లాల్లో 3 ప్రత్యేక ఆస్పత్రుల ఏర్పాటు.
– ఒక్కో ఆస్పత్రి ఏర్పాటుకి రూ.180కోట్లతో ప్రణాళిక
– మెడికల్ కాలేజీలు, జిల్లా ప్రధాన ఆస్పత్రులలో పీడియాట్రిక్ వార్డుల ఏర్పాటు
– ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలకు చిన్నారులలో వచ్చే కరోనా లక్షణాలు, చికిత్సలపై శిక్షణ
– ముందస్తుగా అవసరమైన అత్యవసర మందుల సేకరణ
– పిల్లల్లో థర్డ్ వేవ్ ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు
– ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులలో అవకాశం ఉన్నచోట పిల్లలకు ప్రత్యేక వార్డులు
– చిన్న పిల్లల వైద్యుల ఖాళీలు గుర్తించి, వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు
– పిల్లలకు వ్యాధినిరోధక శక్తి పెంపొందించేలా.. గోరుముద్ద పథకంలో ఇచ్చే పదార్థాల్లో మార్పులు, చేర్పులు..
– పిల్లలకు వైద్యం అందించాల్సిన ప్రైవేటు ఆస్పత్రులను ముందుగానే ఎం ప్యానెల్‌ కోసం గుర్తింపు
– ఆస్పత్రుల వారీగా ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి..

థర్డ్ వేవ్ ని ఎదుర్కొనేందుకు అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు వైద్య రంగం సిద్ధంగా ఉండాలని సూచించారు సీఎం జగన్. సెకండ్ వేవ్ ని ఏపీ సమర్థంగా ఎదుర్కొన్నా.. ఆక్సిజన్ అవసరాలు తీర్చడంలో కొన్ని లోటుపాట్లు జరిగాయని, వ్యాక్సినేషన్ స్పీడ్ పెరగలేదని ఆయన గుర్తు చేశారు. థర్డ్ వేవ్ ముప్పు వచ్చేలోపే టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. మూడో దఫాలో ఆక్సిజన్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. థర్డ్ వేవ్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని, చిన్నారుల చికిత్స విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.