కేంద్రం చెప్పిన ‘టీకా’ తాత్పర్యం..

దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఫ్రీ అంటూ ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ ప్రకటన చేసిన తర్వాత.. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు సేకరించే వ్యాక్సిన్ల రేటుని భారీగా పెంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఓవైపు ప్రభుత్వంలో ఉచితం అంటూనే, మరోవైపు ప్రైవేటు వ్యాక్సిన్ ని ప్రోత్సహించాలనుకోవడం ఎంతవరకు సమంజసమో కేంద్ర పెద్దలకే తెలియాలి. జూన్ 12నుంచి వ్యాక్సినేషన్ జెట్ స్పీడ్ లో వెళ్తుందని చెప్పిన ప్రధాని మోదీ.. నిల్వలు లేని సమయంలో వ్యాక్సిన్ ను ఎక్కడినుంచి ఎలా తెచ్చిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. నత్తనడకన సాగుతున్న టీకా ప్రక్రియ ఈ ఏడాది నవంబర్ నాటికి 80శాతం పూర్తవుతుందని చెప్పడం కూడా అతిశయోక్తి కాక మరోటి కాదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీకా వివరాలు రహస్యంగా ఉంచండి అంటూ కేంద్రం, రాష్ట్రాలకు జారీ చేసిన ఆదేశాలు మరింత కలకలం రేపుతున్నాయి.

కేంద్రం విడుదల చేస్తున్న అధికారిక గణాంకాల ప్రకారం భారత్ లో ఇంకా వ్యాక్సినేషన్ ప్రాథమిక దశను కూడా దాటలేదని అర్థమవుతుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కేవలం 24కోట్ల టీకా డోసులు మాత్రమే వేయగలిగారు. ఒక్కొకరికి రెండు డోసుల ప్రకారం, కేవలం 12కోట్లమందికే టీకా అందినట్టు లెక్క. దీని ప్రకారం చూస్తే.. భారత జనాభాలో ఎంతశాతం టీకా పొందగలిగారు, ఎంతమంది దానికోసం వేచి చూస్తున్నారో ఈజీగా అర్థమవుతుంది. అయితే ఈ దశలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారాయి. వ్యాక్సిన్ లెక్కల్ని రాష్ట్రాలు గోప్యంగా ఉంచాలని, టీకా నిల్వలు, ఇతర వ్యవహారాలను బయటపెట్టొద్దని ఉత్తర్వులొచ్చాయి. దీనిపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లెక్కలు దాచిపెట్టి ఎవరిని మభ్యపెట్టాలనుకుంటున్నారని, అసలు ఇలాంటి ఆలోచన రావడమే దురదృష్టకరమని అన్నారు. కేంద్రం తప్పుడు నిర్ణయాలతో ఇప్పటికే ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఇకపై అయినా ఇలాంటి వ్యవహారాలు కట్టిపెట్టాలన్నారు. టీకా వివరాల్ని రహస్యంగా ఉంచాలనుకోవడం సరికాదని విమర్శించారు.

సిసోడియా వ్యాఖ్యలపై వెంటనే కేంద్రం వివరణ ఇచ్చుకుంది. ఎలక్ట్రానికి వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్.. (eVIN)లో నమోదు చేస్తున్న వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం సరికాదనే ఉద్దేశంతోటే తాము అలా ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిపింది కేంద్రం. ఏయే టీకాలు ఎంత మేర నిల్వ ఉన్నాయనే విషయం ప్రైవేటు కంపెనీలకు తెలియడం మంచిది కాదని, టీకా మార్కెట్ ని ఇది ప్రభావితం చేస్తుందని వివరణ ఇచ్చింది. అయితే రహస్య విధానంపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. సీక్రెట్ గా వ్యాక్సినేషన్ చేపడితే.. మోదీ ప్రకటించిన 80శాతమే కాదు.. నవంబర్ నాటికి వందశాతం భారత ప్రజలకు టీకా ఇచ్చినట్టు లెక్కలు చెప్పేయొచ్చని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నాయి విపక్షాలు.