ఏడురాష్ట్రాల ఎన్నికలకోసం బీజేపీ కసరత్తులు..

వచ్చే ఏడాది జరగబోతున్న ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకోసం బీజేపీ పడరాని పాట్లు పడుతోంది. ఏడురాష్ట్రాల్లో పంజాబ్ మినహా మిగతా ఆరు చోట్ల బీజేపీ, దాని సంకీర్ణాలు అధికారంలో ఉన్నాయి. రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి ఊపిరులూదిన పంజాబ్ లో వీస్తున్న వ్యతిరేక పవనాలను తట్టుకోవడం బీజేపీకి వీలయ్యేలా లేదు. అదే సమయంలో మిగతా ఆరు రాష్ట్రాల్లో, ముఖ్యంగా యూపీలో అధికారాన్ని నిలబెట్టుకోడానికి కమలదళం ఆపసోపాలు పడుతోంది. దీనికోసం ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తోంది.

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఎవరెక్కడ..?
7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా కేంద్రం మంత్రి వర్గ విస్తరణకోసం పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో ఉపయోగపడేలా.. ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కొకర్ని ఎంపిక చేసుకుంటోంది బీజేపీ అధిష్టానం.

యూపీనుంచి అనుప్రియ పటేల్..
ఉత్తర ప్రదేశ్ లో మిత్ర పక్షం అప్నా దల్ నుంచి అనుప్రియ పటేల్ ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలనుకుంటోంది అధిష్టానం. వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యమిచ్చేలా ఈ వ్యూహం రచించింది. మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సి ఉంది. బీహార్ మిత్రపక్షం జేడీయూకి కూడా స్థానం కల్పించాల్సిన బాధ్యత బీజేపీ అధిష్టానంపై ఉంది. ఇక సుశీల్ మోదీ కూడా తనకు న్యాయం చేయాలంటున్నారు. అసోం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్ కూడా కేంద్ర మంత్రి పదవికోసం ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్ వంటివారు ఒకటికంటే ఎక్కువ శాఖలతో కుస్తీ పడుతున్నారు. ఇలాంటి వారిపై పని ఒత్తిడి తగ్గించి, పనిలో పనిగా కొత్త మొఖాలకు అవకాశమిచ్చి అసెంబ్లీ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవాలని చూస్తోంది బీజేపీ.

యూపీ కీలకం..
కేంద్ర మంత్రి వర్గంలో యూపీకి బెర్త్ ఖరారు చేయడంతోపాటు, యూపీ మంత్రి వర్గంలో కూడా భారీ మార్పులు చేర్పులు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. సీఎం యోగి తన సొంత వర్గం ఠాకూర్ లకు ఇచ్చిన ప్రాధాన్యం, ఇతర వర్గాలకు ఇవ్వడంలేదనే అపవాదు ఉంది. దీంతో బ్రాహ్మణులు కాస్త గుర్రుగా ఉన్నారు. వారిని ఊరడించేందుకు ఆ వర్గం నుంచి ఇటీవలే ఎంపీ జితిన్ ప్రసాదను బీజేపీలో చేర్చుకున్నారు. రాహుల్ గాంధీ సన్నిహితుడిగా పేరున్న జితిన్ కు కాషాయ కండువా కప్పేసి తమవైపు లాక్కున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి బ్రాహ్మణ వర్గంలో సింపతీకోసం చూస్తున్నారు. ప్రధానికి అత్యంత సన్నిహితుడు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న మాజీ ఐఏఎస్ అధికారి ఏకే శర్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆయన్ను రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటి వరకూ డిప్యూటీ సీఎంగా ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్యను యూపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించాలనేది కూడా ఎన్నికల వ్యూహంలో భాగమే.

ఎన్నికల కసరత్తు ఎలా మొదలవుతుందంటే..?
అసెంబ్లీల ఎన్నికలకోసం ఈనెల 18నుంచి పూర్తి స్థాయిలో కసరత్తు మొదలు కాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ రూపొందింది. సీనియర్ నేతలు దుష్యంత్ గౌతమ్, మురళీధర రావు నేతృత్వంలో ఈ ప్రణాళిక అమలవుతుంది. పార్టీ క్యాడర్ ను, నాయకుల్ని ఎన్నికలకు సిద్ధం చేయడానికి జులై 10వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.

మరోవైపు ఎన్నికలు జరిగే రాష్ట్రాలనుంచి 25మంది ఎంపీలతో అమిత్ షా భేటీ కాబోతున్నారు. వీరికి ఎన్నికల బాధ్యతలు కేటాయిస్తారు. మొత్తమ్మీద కొవిడ్ నిర్వహణలో విఫలమయ్యారనే అపవాదు మూటగట్టుకున్న కేంద్రం.. ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోడానికి సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలని చూస్తోంది.