కుంభమేళాలో కరోనా ఫేక్ రిపోర్ట్ లు.. పుణ్యంకోసం పాపం..

కరోనా సెకండ్ వేవ్ అప్పుడప్పుడే ఉధృతమవుతున్న వేళ కుంభమేళా వంటి కార్యక్రమాలకు అనుమతిచ్చి కేసుల సంఖ్య భారీగా పెరిగేందుకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా దోహదపడిందనే విమర్శలున్నాయి. అయితే అంతకంటే దారుణమైన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. కుంభమేళాకు అనుమతిచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, యాత్రికులకు కరోనా నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి అనే నిబంధన విధించడంతో.. ఫేక్ రిపోర్టులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా లక్ష రిపోర్టులు ఫేక్ అని బయటపడింది. దీంతో నిర్వాహకులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కుంభమేళాకు వచ్చిన భక్తులు, సందర్శకుల్లో దాదాపుగా 70శాతం మంది కరోనా బారిన పడ్డారనే సమాచారం కూడా ప్రభుత్వం వద్ద ఉంది. నెగెటివ్ రిపోర్టులు వచ్చినవారినే కుంభమేళాకు అనుమతించాం కదా, మరి వైరస్ ఎలా వ్యాపించిందంటూ నిఘా విభాగాలు ఆరా తీశాయి. దీంతో అసలు విషయం బయటపడింది. ఏకంగా లక్షమంది ఫేక్ రిపోర్టులతో కుంభమేళాకు వచ్చి వైరస్ వ్యాప్తికి కారణం అయ్యారని తేలింది.

కుంభమేళా సందర్భంగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ సుమారు 4 లక్షల మేర కరోనా టెస్టులు చేయగా అందులో లక్ష వరకు ఫేక్‌ రిపోర్ట్‌ లు ఇచ్చారని తేలింది. అంటే పరీక్షలు చేయకుండానే కరోనా నెగెటివ్ అంటూ టెస్టు రిపోర్టులు జారీ చేశారు. 50మందికి ఇచ్చిన రిపోర్టుల్లో ఒకే ఫోన్ నెంబర్ ఉండటం, ఒకే చిరునామా కింది సుమారు 5వేలమందికి రిపోర్టులు ఇవ్వడం.. ఇలా అన్నీ తప్పుడు వ్యవహారాలే జరిగాయి. పక్కా ఆధారాలతో రాష్ట్ర నిఘా విభాగం ఈ వ్యవహారాలన్నీ బయటపెట్టింది. అంటే నెగెటివ్ రిపోర్టులకోసం డబ్బులు చేతులు మారాయని తేలింది. కరోనా టెస్టుల్లో ఓ ప్రైవేటు ఏజెన్సీ భారీగా అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. డేటాఎంట్రీ ఆపరేటర్లు, విద్యార్థులతో ఈ టెస్టులు నిర్వహించారు.

ఫేక్‌ రిపోర్టుల విషయంపై కుంభమేళా హెల్త్‌ ఆఫీసర్‌ అర్జున్‌ సింగ్‌ సెనగర్‌ స్పందించారు. విచారణ జరుగుతోందని తెలిపారు. 15రోజుల్లోగా విచారణ రిపోర్టుని ప్రభుత్వానికి అందిస్తామని హెల్త్ సెక్రటరీ చెబుతున్నారు. మరోవైపు కరోనా టెస్టులపై సమగ్ర విచారణ పూర్తి అయ్యేంత వరకు ప్రైవేటు ఏజెన్సీలకు చెల్లింపులను నిలిపివేయాలని హరిద్వార్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలిచ్చింది.