కొత్త రూల్స్ పెట్టిన ఫిలిం ఛాంబర్

కరోనా సెకెండ్ వేవ్ తర్వాత మెల్లమెల్లగా షూటింగ్స్ మొదలవ్వడంతో టాలీవుడ్ లో స్థితిగతులపై
ఫిలింఛాంబర్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా కొన్ని కీలకమైన మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఈ సూచనల్ని ప్రతి సినిమా యూనిట్ పాటించాలని ఆదేశించింది. అప్పుడు మాత్రమే సురక్షితంగా
షూటింగ్స్ జరుగుతాయని తేల్చిచెప్పింది.

1. కరోనా వల్ల షూటింగ్స్ నిలిచిపోయాయి. అలా ఏ సినిమా షూటింగ్ ఆగిపోయిందో, ఆ సినిమాకే
నటీనటులు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మధ్యలో ఆగిన సినిమా పూర్తయిన తర్వాతే కొత్త సినిమాకు కాల్షీట్లు
ఇవ్వాలి

2. దర్శకులు కూడా తమ సినిమాల షెడ్యూల్స్ ను మరోసారి సమీక్షించుకోవాలి. వీలైనన్ని తక్కువ
రోజుల్లో షూటింగ్ పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేసుకొని సెట్స్ పైకి రావాలి. ఎన్ని ఎక్కువ రోజులు
షూట్ చేస్తే అంత రిస్క్ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.

3. షూటింగ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరు.. ప్రొడక్షన్ నుంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వరకు అంతా వ్యాక్సిన్
తీసుకున్నట్టు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. షూటింగ్ కు వచ్చే ప్రతి ఒక్కరు కనీసం ఒక్క
డోసైనా వ్యాక్సిన్ వేసుకొని ఉండాలి. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తుల్ని లొకేషన్ కు
అనుమతించకూడదు.

4. 24 క్రాఫ్ట్స్ కు చెందిన వాళ్లకు ఇన్సూరెన్స్ కచ్చితంగా తీసుకోవాలి. ఆ బాధ్యతను ఫెడరేషన్లు, ఆయా
విభాగాల యూనియన్లు భుజానికెత్తుకోవాలి.